Jul 23,2023 21:23

శిలా ఫలక ఆవిషకరణలో సుబుదేంద్రథీర్తులు, మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ ఎంపి టిజి వెంకటేశ్‌, తదితరులు

ఆదర్శ ప్రాయుడు శ్రీరాముడు
- శ్రీ మఠం పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు
- శ్రీమఠంలో 108 అడుగుల పంచలోహ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
- వర్చువల్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
- పాల్గొన్న మంత్రి గుమ్మనూరు, మాజీ ఎంపి టిజి, తదితరులు

ప్రజాశక్తి - మంత్రాలయం

సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయుడు శ్రీరాముడు అని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు అన్నారు. ఆదివారం మంత్రాల యంలోని ఎమ్మిగనూరు రహదారిలో ఏర్పాటు చేయనున్న 108 అడుగుల పంచలోహ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా వర్చువల్‌ విధానం ద్వారా శిలాఫలకం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, రాజ్యసభ ఎంపి టిజి వెంకటేశ్‌, బిజెపి నాయకులు హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి, వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై. ప్రదీప్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు మాట్లాడుతూ రాఘవేంద్రస్వామి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు త్రేతాయుగంలో అరణ్య వాసం చేసిన సందర్భంగా మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం వద్ద ఉన్న బండ పై విశ్రమించారని తెలిపారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రవేశం చేసిన సమయంలో ఆ బండ రాయినే బృందావనాకి ఉపయోగించుకోవాలని శ్రీ రాఘవేంద్రస్వామి వారు చెప్పినట్లు చరిత్ర చెబుతోం దన్నారు. శ్రీరాముని పంచలోహ విగ్రహం ఏర్పాటు వల్ల గొప్ప పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీమఠం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం వచ్చిన ప్రముఖులకు శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు శ్రీ రాముని మెమొంటో అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ఇంచార్జ్‌ విశ్వనాథ్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ భీమయ్య, నాయకులు లక్ష్మినారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.