ప్రజాశక్తి - ఆదోని
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడేవారని, అలాంటి సమస్య రాకుండా ఆదోనిలోని మధు ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎస్‌కెడి కాలనీ మధు ఆస్పత్రిలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గుర్రెడ్డి ఆధ్వర్యంలో చికిత్స విభాగాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆస్పత్రి డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చి ఇన్నేళ్లయినా ఆదోనిలో ప్రయివేట్ ఆస్పత్రుల్లో సదుపాయం లేకపోవడంతో చికిత్సల కోసం కర్నూలు, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. అక్కడికి వెళ్లిన కూడా ఆస్పత్రి నిర్వాహకులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో దిక్కుతోచక చాలామంది తమకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆదోనిలో కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ఎన్నో ఏళ్లుగా కృషి చేసినట్లు తెలిపారు. మధు ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. తనవంతుగా సహకరించి ఇక్కడ సేవలు అందించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని తెలిపారు. రోగులు ఇబ్బందులు పడకుండా ఆస్పత్రి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఆర్‌టిసి ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ సేవలు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాయకులు అశోక్ నంద రెడ్డి, సుబ్బారెడ్డి, మురళీ రెడ్డి, దేవా, దుర్గప్ప, పెరిగేలా నారాయణ, వాల్మీకి లక్ష్మీనారాయణ, ఆస్పత్రి ఉద్యోగులు రాజు, సునీల్ ఉన్నారు.
ఆరోగ్యశ్రీ చికిత్స విభాగాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










