ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఆదోని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, కరువు సాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు డిమాండ్ చేశారు. రైతుసంఘం, వ్యకాస ఆధ్వర్యంలో కుప్పగల్ క్రాస్, సిరుగుప్ప క్రాస్, సంతకుడ్లూరు దగ్గర రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు తక్షణమే ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని కోరారు. ఈఏడాది తీవ్ర వర్షాభావం పరిస్థితుల వల్ల కరువు ఏర్పడిందని తెలిపారు. కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఆదోనిని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్, జనవరిలో వెళ్లాల్సిన వలసలు సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయని, వెంటనే ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు మండల కార్యదర్శి వీరారెడ్డి, వ్యకాస మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం మండల అధ్యక్షులు కె.శేఖర్, సిఐటియు మండల అధ్యక్షులు జె.రామాంజనేయులు పాల్గొన్నారు.
రాస్తారోకో చేపడుతున్న నాయకులు










