ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఆదోని నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి, టిడిపి, జనసేన అభ్యర్థులు 'మేమంటే... మేము' అంటూ ప్రచారం మొదలు పెట్టి జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆదోని గడ్డ ఎవరికి అడ్డాగా మారుతుందో వేచి చూడాల్సిందే మరి.
వైసిపి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వైసిపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'గడపగడప మన ప్రభుత్వం'లో ప్రతి ఇంటి ముందు వాలిపోతున్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ప్రచారానికి తెర లేపారు. వైసిపిలో క్రియాశీలకంగా వ్యవహరించిన బసాపురం శ్రీకాంత్ రెడ్డి బయటకొచ్చి ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ప్రస్తుత కౌన్సిలర్ భర్త, వంశీ చైతన్య హాస్పిటల్ అధినేత రమేష్ యాదవ్ ఇప్పటికే జనసేనలో చేరారు. ప్రస్తుతం మరో కౌన్సిలర్ భర్త స్థానిక నేతలపై నమ్మకం లేదని, వ్యక్తిగతంగా బయటకు పొక్కకుండా విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిమానంపై పార్టీలో కొనసాగుతున్నానని చెబుతున్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాస్పత్రులు, కెడిసిసి బ్యాంకు, మెడికల్ కళాశాల, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సంతేకుడ్లూరు గ్రామం వద్ద ఎస్‌ఎస్‌సి ట్యాంకు నిర్మాణం, నాడు-నేడు ద్వారా అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల పునర్నిర్మాణంలాంటి కార్యక్రమాలే వైసిపిని గెలిపిస్తాయని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
టిడిపిలో ఎవరికి వారే.. యమునా తీరే...
టిడిపిలో సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, సోదరుడు ఉమాపతి నాయుడు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నెల రోజుల పాటు పట్టువదలకుండా దీక్షలు చేపట్టారు. ఆందోళనలు మాత్రం పోటాపోటీగా వేర్వేరుగా జరిగాయి. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మదిరె భాస్కర్ రెడ్డి, ఎపి ఫుడ్ కార్పొరేషన్ మాజీ సభ్యులు గుడిసె కృష్ణమ్మ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. టిడిపి బరిలోకి పాత అభ్యర్థులను కాకుండా కొత్త ముఖం పోటీలో దింపేందుకు అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగు తమ్ముళ్లలో ఉన్న విభేదాలు ఎన్నికల నేపథ్యంలో ఏ మేరకు నష్టం కలిగిస్తాయో అన్న ఆందోళనలను అధిష్టానంతో పాటు క్యాడర్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. విభేదాల నడుమ టికెట్ ఎవరికీ ఇచ్చినా గెలుపునకు కృషి చేయకపోగా ఓటమికే ఎక్కువ శ్రమిస్తారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ అభ్యర్థికి టికెట్ వచ్చేనా..?
ఈసారి టిడిపితో కలిసి పోటీ వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ ఇప్పటికే ప్రకటించారు. జనసేన టికెట్ ఆదోని ఇన్‌ఛార్జీ మల్లప్పకు వస్తుందా అని, వచ్చినా స్థానిక నాయకులు సహకరిస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక నాయకులు అధికార పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉంటున్న వామపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎలాగైనా ఆదోని నుంచి పోటీ చేసేందుకు వామపక్ష నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లోనే రెండు గ్రూపులు
చరిత్ర కలిగిన కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బోయ నీలకంఠప్ప, మాజీ కౌన్సిలర్ దిలీప్ ధోకా, మరో గ్రూపు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల జయంతి, వర్థంతి జరుపుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన పార్టీ టికెట్ ఆశిస్తున్న శ్రీకాంత్ రెడ్డి
రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎసి శ్రీకాంత్ రెడ్డి వైసిపిలో ఇమడలేక బయటకొచ్చి సందట్లో సడేమియా అన్న చందంగా సీటు కోసం ప్రయత్నాలు చేపట్టినట్లు సమాచారం. పికె టీం పర్యటనలో భాగంగా శ్రీకాంత్ రెడ్డిని కూడా విచారించినట్లు తెలిసింది. ఆయన ప్రజాదరణపై ఆరా తీసినట్లు సమాచారం. నికర జలాల కోసం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రజాదరణ పొందేందుకు, ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనక్షేత్రంలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆదోనిలో ముస్లిం, మైనార్టీ ఓట్లే అధికం
నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లిం, మైనార్టీలకు టికెట్ ఇస్తే కర్నూలు పార్లమెంటరీ ముస్లిం, మైనార్టీ సెల్ అధ్యక్షులు, టిడిపి నాయకులు సయ్యద్ అప్సర్ బాష పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం 55,590 మంది ముస్లిం, మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రధాన పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని, ఈసారి ఎలాగైనా ముస్లిం, మైనారిటీకి టికెట్ ఇస్తే సత్తా ఏంటో చూపిస్తామని పలువురు చెబుతున్నారు. మరోపక్క పలు సామాజిక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని పట్టుదలతో ప్రయత్నాలను చేస్తున్నట్లు సమాచారం.










