అదనపు ల్యాబ్ సౌకర్యమున్న ఏకైక శిక్షణా కేంద్రం 'ఎన్‌టిటిఎఫ్
వార్షికోత్సవ వేడుకల్లో ఎపి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కె.విజయ భాస్కర్
ప్రజాశక్తి-గన్నవరం
రాష్ట్రంలో ప్రయివేట్ యాజమాన్యంలో పనిచేసే శిక్షణా కేంద్రాల్లో అదనపు ల్యాబ్ సౌకర్యం గల ఏకైక శిక్షణ కేంద్రం గన్నవరం ఎన్‌టిటిఎఫ్ అని ఎపి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ కె.విజయభాస్కర్ కితాబు ఇచ్చారు. గురువారం రాత్రి జరిగిన ఎన్‌టిటిఎఫ్ 2022-2023 వార్షికోత్సవ వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు ప్రిన్సిపాల్ దండమూడి మహీధర్ అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ మహీధర్ వార్షిక నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయభాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఎన్‌టిటిఎఫ్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రారంభించిన గన్నవరం ఎన్‌టిటిఎఫ్ ఆయన ఆశయ సాధనకు ఎంతో కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో ఎంతోమంది విద్యార్థులకు బంగారు బాట వేసిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారన్నారు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక విద్యకు మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు. డిప్లమో కోర్సులు చదివిన వారికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్‌టిటిఎఫ్ లాంటి సంస్థల్లో చదివిన వారికి అతి తక్కువ సమయంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంజనీరింగ్ రంగంలో నేడు అనేక ఆధునీకరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ఆ మెళుకువలను నేర్చుకోవాలన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలకు మరింతగా పదును పెడితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చునన్నారు. పాలిటెక్నికల్, ఇతర టెక్నికల్ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చేరిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చునన్నారు. ఎన్‌టిటిఎఫ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులే వెన్నెముక లాంటి వారన్నారు. తల్లిదండ్రుల సమావేశానికి అత్యధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరు కావడం విశేషమన్నారు. మరో అతిథిగా ప్రయివేటు పాఠశాలల సంఘ అధ్యక్షులు జి.మోహన్ రావు మాట్లాడుతూ దేశంలో అన్ని విద్యాసంస్థలు సాఫ్ట్వేర్ రంగం వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో హార్డ్వేర్ రంగాన్నే ఎంచుకునే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన సాంకేతిక విద్యను అందించటం అభినందనీయమన్నారు. ఎన్‌టిటిఎఫ్ యాజమాన్య కమిటీ ఉపాధ్యక్షురాలు కల్పన, నేషనల్ లీడర్ సతీష్ జోషి మాట్లాడుతూ గన్నవరం ఎన్‌టిటిఎఫ్ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. అనంతరం స్పోర్ట్స్ కల్చరల్ అకాడమిక్ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా 33 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న కళాశాల మేనేజర్ పద్మజ దంపతులను ముఖ్య అతిథి విజయ భాస్కర్ దుశ్యాలువాతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకర్షించాయి. ఎన్‌టిటిఎఫ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల చరిత్రలు స్క్రీన్‌పై ప్రదర్శించడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.










