ప్రజాశక్తి-కొండపి
ప్రభుత్వం ఒకే సారి రకరకాల చార్జీల పేరుతో విద్యుత్ బిల్లుపై పోట్లు పొడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లులో విధిస్తున్న ట్రూ ఆఫ్ సర్దుబాటు చార్జీలను వసూలు చేయటానికి నిలుపు వేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కొండపి కేంద్రంలో ఆర్టీసి బస్టాండ్ సెంటర్లో విద్యుత్ సంస్కరణలపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వామ పక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై కరెంటు చార్జీలు పెంచిందని, స్లాబులు రేట్లు మార్చేశారని ప్రజల కప్పి గతంలో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు బిల్లులు కట్టిస్తున్నారని ప్రభుత్వం విధించిన సర్దుబాటు చార్జీలు నిలిపివేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించాలని ఈనెల 16వ తేదిన కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేవారు. ఈ ప్రజా బ్యాలెట్‌లో 154 మంది పాల్గొనగా 153 వ్యతిరేకంగా ఒకటి అనుకూలంగా వచ్చాయన్నారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కరెంటు చార్జీల పెంపు ప్రభాదవం ప్రజల్లో తీవ్రంగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక నిరుపేద సామాన్యుడి ఇంటికి గతంలో రూ.150 నుండి 200 వరకు మాత్రమే నెల కరెంట్ బిల్లు వస్తుండుగా అది రూ.500రూపాయలకు పెరిగిందని చెప్పారు. ట్రూ ఆప్ చార్జీలు, సర్ చార్జి, కస్టమర్ , సర్వీస్ తదతర చార్జీల పేరుతో కరెంటు బిల్లులు ఇవ్వడం పట్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2013వ సంవత్సరం నాటి ఎవరివో బకాయిలు తమ బిల్లులో వేసి వసూలు చేయడం ఏమిటని ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కెజి మస్తాన్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా నాయకులు ఎన్.నాగరాజు, వై.వి కృష్ణారావు, సిపిఎం నాయకులు జి.వందనం, సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మి, సిపిఐ ఎంఎల్ నాయకులు పి.కోటేశ్వరరావు, జి.వెంకటరావు, ఏఐకెయంఎస్ నాయకులు వైస్.చంద్రశేఖర్, సిఐటియు నాయకులు రూబెన్, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.










