ఆదిలోనే కష్టాలు..
- వర్షం కోసం రైతులు ఎదురుచూపు
ప్రజాశక్తి - కొత్తపల్లి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తొలకరి వర్షం పడిన వెంటనే విత్తనాలు వేసుకోవచ్చని ఎదురుచూస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది తొలకరి చినుకులు కురిసిన వెంటనే రైతన్నలు తమ పొలాల్లో విత్తనాలను వేసుకొని పంటల సాగులో నిమగమయ్యేవారు. ఈ ఏడాది కూడా తొలకరి వర్షాలు వస్తాయని వేసవిలో రైతులు పొలాలను దుక్కులు దున్ని, గతంలో వేసిన పంట వ్యర్థాలను తీసివేశారు. పొలాలను సేద్యాలు చేసుకొని సాగుకు సిద్ధం చేసి తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
కొత్తపల్లి మండలంలో రైతులు ఎక్కువ శాతం వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల సాధారణ సాగు భూమి ఉంది. ఇందులో 17.5 వేల ఎకరాల సాగు భూమిని రైతులు పంటలు వేసేందుకు అంతా సిద్ధం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఖరీఫ్ సాగు కోసం వేసవిలోనే పొలాలను సిద్ధం చేసుకుని తొలకరి చినుకులు కురిసిన వెంటనే పలు రకాల విత్తనాలు వేస్తారు. అదే క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాల కారణంగా రైతన్నలు తమ పొలాలను సిద్ధం చేసి తొలకరి చినుకులు పడిన వెంటనే విత్తనాలు వేయాలన్న సంకల్పంతో ఇప్పటికే విత్తనాలను కూడా అప్పులు చేసి తెచ్చి పెట్టుకున్నారు. గ్రామాల్లో ప్రధానంగా మొక్కజొన్న, పత్తి, మిరప, వరి, మునగ, మినుము తదితర పంటలను రైతులు సాగు చేస్తారు. కొందరు రైతులు ఆనవాయితీగా చేర్పులు మార్పులు చేసుకుని పంటలు సాగు చేస్తారు. అయితే ఆదిలోనే వర్షాలు లేక రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. గత సంవత్సరం ఈ సమయంకల్లా మండలంలో రైతులు విత్తనాలు వేయడంతోపాటు వేసిన మొలకలు కూడా వచ్చి వ్యవసాయ పనుల్లో బిజిగా గడిపుతూ ఉన్నారు. ఈ ఏడాది మాత్రం ప్రతిరోజు సాయంత్రం సమయంలో మేఘాలు ఊరిస్తూ వీస్తున్న గాలులకు రైతన్నలు వర్షాలు పడుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు తప్ప వర్షాలు మాత్రం పడకపోవడంతో నిరాశ చెందుతున్నారు.వర్షాలు ఆలస్యంగా పడితే పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు లేకపోతే సరైన దిగుబడి రాక రైతన్నలు నట్టేట మునిగే ప్రమాదం ఉంది. గత సంవత్సరంలో ఈ సమయానికల్లా విత్తనాలు మొలకలెత్తి సుమారు నెల పైరు సాగులో ఉండేదని రైతులు చెబుతున్నారు. జూన్ నెల మధ్యలోకి వచ్చినా నేటికీ పగలంతా ఎండకాలంలా విపరీతమైన ఎండలు, వడగాల్పులు వీస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో చిన్న, సన్న కారు రైతులు పొలాలను ముందుగానే గుత్తలు చెల్లించారు. సకాలంలో వర్షాలు రాకపోతే సరైన పంటలు రాక పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా చెల్లించాలోనని కౌలు రైతులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రకృతి రైతులపై కన్నెర్ర చేయడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది.










