వీరఘట్టం: ఒడిశాలోని లఖేరా అడవుల నుండి 2007లో ఏనుగుల గుంపు మైదాన ప్రాంతాలకు వచ్చి సుమారు 16ఏళ్లు కావస్తుంది. ఏనుగుల గుంపు సంచారం కారణంగా వందలాది ఎకరాల పంట నష్టంతో పాటు రెండు నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏనుగుల గుంపును జూకు తరలించడంలో పూర్తిగా విఫలమై అయిందని చెప్పాలి. కొద్దిరోజుల కిందట జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండడంతో అదిగో పులి...ఇవిగో ఏనుగులు అంటూ చర్చ జరుగుతుండడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత నెల 15న నడిమికెళలో పులి సంచరించినట్లు పాదముద్రల ద్వారా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈనెల 1న సీతంపేట మండలంలో పులి సంచరిస్తుందని, 2న వీరఘట్టం మండలంలోని మహాదేవివలస, కంబరలో గ్రామస్తుల సమాచార మేరకు ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలు పరిశీలించిన పులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం కురుపాం మండలంలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
పరిహారం కోసం ఎదురుచూపు
ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరఘట్టం మండలంలోని నడుకూరు, కిమ్మి, కొట్టుగుమ్మడ చిట్టపూడివలస ఏనుగుల సంచార కారణంగా సుమారు 12 ఎకరాల్లో మొక్కజొన్న, చెరుకు పంటలు నాశనంతో పాటు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 15 రోజులు ఏనుగులు గుంపు తిష్ట వేయడంతో ఉపాధి పనులకు, పంటపొలాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురైనట్లు ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టాలపై ఈ ఏడాది మార్చి 4న కిమ్మి గ్రామ సచివాలయంలో తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ పంట నష్టపోయిన రైతులతో సమావేశం ఏర్పాటు చేసి నష్టాలపై వివరాలు సేకరించారు. నెలలు గడుస్తున్నా పంట నష్టపరిహారం అందజేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని బత్తిలిలో 4ఏనుగుల గుంపు, కురుపాం మండలంలో 8 ఏనుగుల గుంపుతో పాటు ఇదే మండలంలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగులు, పులి సంచార జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయమై ఆదివారం స్థానిక డిఆర్‌ఒ బి.రవిబాబు వద్ద ప్రజాశక్తి ప్రస్తావించగా పంట నష్టం పరిహారం కు సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు పంపామని తెలిపారు.
పులి సంచారంతో ప్రజలు భయాందోళన
గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో ఇటీవల పులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వీరఘట్టం మండలం కంబర గ్రామ సమీపంలో పులి పాదం ముద్రలు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే కంబర, రావివలస, పెద్దబుడ్డిడి పరిసర ప్రాంతాల్లో చుట్టూ పొలాలు, తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు పొలం పనులకు వెళ్లి వస్తుంటారు. పులి సంచారం ఉందని తెలియడంతో బిక్కుబిక్కుమంటూ భయంతో పొలాలకు వెళ్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అటవీశాఖ అధికారులు ముందస్తుగా మేల్కొని పులి సంచారంపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.










