Oct 08,2023 21:02

ప్రజాశక్తి - సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రెండు కీలక మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల మార్పు జరగాల్సి ఉంది. రెండున్నరేళ్ల తర్వాత చైర్‌పర్సన్‌ను మార్చి వైస్‌ చైర్మన్‌గా నాయకులకు ఆ పీఠంపై కూర్చోబెడతామని పార్టీ అగ్రనేతలే అప్పట్లో మాటిచ్చారు. సరిగ్గా రెండు న్నరేళ్ల క్రితం వైసిపి తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఇద్దరు మహిళా నాయకులు పోటీ పడడంతో జిల్లా నాయకత్వం ఒకరికి చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చి ఇంకొకరికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. రెండున్నరేళ్ల తర్వాత చైర్‌పర్సన్‌ను దించి వైస్‌ చైర్మన్‌ను ఆస్థానంలో కూర్చోబెడతామని వైసిపి అగ్రనాయకులు ఒప్పందం కుదిర్చారు. అయితే ఈ అగ్రనేత మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఆ పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయాల్సిన సమయం దాటిపోయింది.
సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ స్థానంలో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న జర్జాపు దీప్తిని రెండున్నరేళ్ల తర్వాత కూర్చోబెడతామని ఉమ్మడి జిల్లా అగ్రనేతలు హామీ ఇచ్చారు. అప్పడు ఇచ్చిన హామీ మేరకు చైర్‌పర్సన్‌ పీఠం ఆశించిన జర్జాపు దీప్తి రెండున్నర ఏళ్ళ పాటు వైస్‌ చైర్‌పర్సన్‌ పదవిని స్వీకరించడానికి అంగీకరించారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ సిఎం రాజన్నదొరల సమక్షంలోనే ఆ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం అమలు చేయాల్సిన గడువు సెప్టెంబర్‌తో ముగిసింది. అయినా పార్టీ జిల్లా నాయకత్వం ఎన్నికలు దగ్గరలో ఉన్నాయన్న సాకుతో ఒప్పందం అమలుకు వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ భర్త నాగేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె పురపాలనపై ఏకాగ్రత పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పట్టణంలో అధికారి పార్టీ ఎదుగు బొదుగూ లేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో మున్సిపాలిటీ నాయకత్వం మార్చాల్సిన అవసరం కనిపిస్తున్నా జిల్లా నాయకత్వం జాప్యం చేయడం వెనుక సామాజిక కోణం దాగి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాను శాసిస్తున్న అగ్రనేత ఒకరు పెద్దమనుషుల ఒప్పందం అమలుకు మోకాలడ్డుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇక పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విషయంలోనూ మార్పు చేయాల్సిన అవసరం ఉన్నా జిల్లా నాయకత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోంది. గతంలో చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో బోను గౌరీశ్వరి, మంత్రి ఉమామహేశ్వరి పోటీ పడగా, వీరి మధ్య ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో చెరి సగం కాలం పాటు చైర్‌పర్సన్‌ పీఠంలో కూర్చునేందుకు పెద్దలు రాజీ ఫార్ములా కుదిర్చారు. అయితే ఇక్కడ కూడా ఆ ఫార్ములా అమలుకు అగ్రనేత అడ్డుపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మన్యం జిల్లాలో కీలకమైన రెండు మున్సిపాలిటీ పీఠాలకు సంబంధించిన చైర్‌పర్సన్ల మార్పు వ్యవహారం జాప్యం జరుగుతున్న కారణంగా పార్టీలో అసమ్మతి నివురు కప్పిన నిప్పులా రాజుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో కీలకమైన మున్సిపాలిటీల ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పందం అమలుకు నోచుకోక పోతే రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెద్ద మనుషుల ఒప్పందానికి లోబడి కొన్ని జిల్లాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, చైర్మన్ల మార్పు జరిగింది. స్థానిక జిల్లాల అగ్రనేతలే ఆ ఒప్పందాలను అమలు చేశారు. అక్కడ అమలైన ఒప్పందం మన్యం జిల్లాలో ఎందుకు అమలు కావడం లేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారపార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు కారణం గానే మున్సిపాలిటీల ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పందం అమలుకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే లపై ఇప్పటికే వున్న ప్రజావ్యతిరేకతకి తాజా పరిణామాలు కూడా తోడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.