Sep 06,2023 23:02

మట్టితరలింపుతో బోసిగా ఉన్న అడ్డతిప్పకొండ

         బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఒక మండల అధికారిని వారి గుప్పెట్లో పెట్టుకుని కొండను కొల్లగొట్టేస్తున్నారు. అడ్డ తిప్ప కొండను అక్రమ మట్టి వ్యాపారానికి ఉపయోగించేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కొండ నుంచి మట్టిని తరలించకుపోతున్నా అధికారులు ఎవరూ దీని గురించి పట్టించుకోవడం లేదు. మట్టిమాఫియా నుంచి అందుతున్న ముడుపుల వల్లనే అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మట్టి తరలింపునకు గ్రామ సర్వే నెంబర్‌ 396-7లో 7.5 ఎకరాలు నక్కలతిప్పలో అనుమతి ఉంది. ఇక్కడ తవ్వడం పూర్తి చేసి, నిబంధనలకు విరద్ధంగా అడ్డతిప్పకొండును తవ్వుతున్నారు. ఇక్కడ కొద్ది నెలల నుంచి అనుమతి లేకుండా రూ.50 లక్షల విలువజేసే మట్టిని తోడి అమ్మేశారు. అడ్డతిప్ప కొండ తూర్పు వైపున జగనన్న కాలనీ పైభాగంలో రాత్రి పూట అనుమతి లేకుండా మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. అడ్డతిప్ప కొండ నామరూపాలు లేకుండా చేయడంలో మట్టి మాఫియా అక్రమాలకు మండలానికి చెందిన ఓ అధికారి సాయం చేస్తున్నారనే గుసగుసలు మండలంలో పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. ఈ మట్టి మాఫీయాపై ఎవైరైనా మండలంలోని ముఖ్య అధికారికి ఫిర్యాదు చేస్తే తాము దానిని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. అలా చెప్పడం తప్పా అంతకుమించి ఒక్క చర్య కూడా తీసుకున్న దాఖలాలు లేవు. జెసిబిలను పెట్టి లారీల్లో మట్టిని తరలించుకుపోతున్నా అక్కడ అధికారులు ఎందుకు నిఘా ఉంచడం లేదనే ప్రశ్న వ్యక్తం అవుతోంది. మట్టి తరలింపు నిషేధిత ప్రాంతం అని కూడా బోర్డులను ఏర్పాటు చేయలేదంటే అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విజిలెన్స్‌ అధికారులు సైతం ఈ మట్టి మాఫియా అక్రమాలపై కన్నేత్తి చూడకపోవడం మరింత ఆరోపణలను రాజేస్తోంది.
ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి
తక్షణం జిల్లా రెవెన్యూ అధికారులు అడ్డతిప్ప కొండను సందర్శించాలి. మట్టి మాఫియా దొంగ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి. లీజును అక్రమ మట్టి తవ్వకాల పనులు చేస్తున్నందున రద్దు చేయాలి. తహశీల్దారు, మట్టి మాఫియా డాన్‌పై బహిరంగ విచారణ చేయాలి. మట్టితవ్వకాలకు సహకరిస్తున్నారన్న నేపథ్యంలో ఇక్కడి అధికారులపై కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి.
అడ్డతిప్పకొండలో ఆగని దోపిడీ
బుక్కరాయసముద్రం :