ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అడ్డాపుశిలలో పరిశీలించారు. పట్టణ శివార్లలోని అడ్డాపుశిల వద్ద 59.80 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం ప్రతిపాదించారు. శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్ గ్రూప్ ఆకార్ ప్రతినిధి ఆషిద్‌తో కలిసికలెక్టర్ స్థలాన్ని సందర్శించారు. కన్సల్టెంట్ స్థలాన్ని సందర్శించిన తర్వాత స్థలం నిర్మాణానికి అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో కలెక్టర్, ఇతర అధికారులు పలుమార్లు సందర్శించి స్థలాన్ని ఖరారు చేశారు. జిల్లా ఏర్పాటుకు ముందు గత జిల్లా యంత్రాంగం కూడా భవన నిర్మాణానికి స్థలాన్ని ప్రతిపాదించింది. అడ్డాపుశిలలో కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ రాబోతోంది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిపాలనకు సరిపోయే, ప్రజల సౌకర్యార్థం ఒక అందమైన భవనాన్ని తీసుకురావడానికి ప్రతి అంశాన్ని పరిశీలించాలని కన్సల్టెంట్‌కు సూచించారు. అడ్డాపుశిల అనువైన ప్రదేశమని, భవిష్యత్తులో మరిన్ని అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం వద్ద భూమి అందుబాటులో ఉందని అన్నారు. అత్యుత్తమ సమీకృత కలెక్టరేట్లలో ఇదొకటి కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రహదారులు, భవనాలు శాఖ ఇన్‌ఛార్జ్ ఇఇ ఎస్.వేణుగోపాల్, డిఇ ఎ.అప్పాజీ, టిడ్కో ఇంజినీర్లు, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.










