Aug 25,2023 20:02

బస్టాండ్‌లో సరైన వసతులు లేక నిలబడి ఉన్న ప్రయాణికులు

ప్రజాశక్తి - కోసిగి
ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయమని ప్రకటించుకునే ఆర్‌టిసి... ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. కోసిగి ఆర్‌టిసి బస్టాండ్‌ ఆటోలు, స్కూటర్లతో పార్కింగ్‌ ప్రదేశంగా కనిపిస్తోంది. బస్సులు బస్టాండ్‌లో ప్రవేశించే మలుపు దగ్గర ఇష్టానుసారంగా దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి ప్రాంగణంలోకి వచ్చే బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్‌టిసి అధికారులు బస్టాండ్‌ ఆవరణంలో ఇష్టానుసారంగా టెండర్ల రూపంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల బస్టాండ్‌ ప్రాంగణంమంతా ఇరుకుగా మారింది. ఆదాయంపై ఉన్న శ్రద్ధ వసతుల కల్పనలో లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. తాగునీటి వసతి లేకపోవడం, కూర్చోవడానికి సరైన కుర్చీలు లేకపోవడంతో ప్రయాణికులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో ఆరు బస్సులు నిలిపేందుకు స్థలం ఉన్నా రెండు బస్సులకు మించి నిలువలేని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, స్కూటర్లు ఇష్టానుసారంగా బస్టాండ్‌ ప్రాంగణంలో తిరగడం వల్ల అది ఒక బస్టాండ్‌ ప్రాంగణమనే విషయమే గుర్తుకురావడం లేదు. ఆర్‌టిసి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బస్టాండ్‌ స్థలంలో దాదాపు పదుల సంఖ్యలో దుకాణాలకు టెండర్లు పిలిచారు. వాటి నుంచి నెలకు రూ.లక్షల్లో ఆర్‌టిసికి ఆదాయం వస్తున్నా అధికారులు మాత్రం ప్రయాణికులకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.