పాలకొండ: స్థానిక కోట దుర్గమ్మ ఆలయంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాలు అసౌకర్యాల నడుమ కొనసాగనున్నాయి. తొలిరోజు నిజరూప దర్శనానికి పాలకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దసరా ఉత్సవాలు ఈసారి కూడా అరకొర సదుపాయాల మధ్య జరగనున్నాయి. క్యూ లైన్ల దగ్గర కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. రేకుల షెడ్డు నిర్మించి యాత్రికులకు క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎండ తీవ్రతకు ప్రతి ఏటా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించలేని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగా ఉండడం వల్ల దూరపు ప్రాంతం నుంచి వచ్చే మహిళలు, చంటి పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఈ దేవాలయంలో కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ ఎక్కడీ
దసరా ఉత్సవాలను పర్యవేక్షించే నాధుడే కరువయ్యారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ ఆలయానికి కమిటీ నియామకం కూడా చేయలేదు. నేతల మధ్య గ్రూపులపోరుతో కమిటీ నియామకం కాలేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ప్రతి ఏటా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి పెత్తనంతో సామాన్య ప్రజానీకానికి అమ్మవారి దర్శన ప్రాప్తి కూడా కలగడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










