ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, వీరికి బుద్ధి చెప్పాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15వ తేది వరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని జనసేనతో కలిపి చేయాలని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి కోట్లలో ప్రజల సొమ్ము వాడుతున్న జగన్, కృష్ణా ట్రిబ్యులన్ తీసుకున్న నిర్ణయాలపై పోరాడేందుకు లాయర్లను పెట్టలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్‌తో కలిశామన్నారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోందని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆన్ చేస్తే చంద్రబాబుకు పేరు వస్తుందని కావాలనే నీళ్లు వదల్లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్సీ పి అనురాధ, మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు.










