హిందూపురం : హిందూపురం ఆటోనగర్ ప్రజల జీవనం సమస్యల నడుమ సాగుతోంది. ఈ కాలనీ ఏర్పడి దశాబ్ధం దాటినా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. అటు పాలకులు పట్టించుకోరు.. ఇటు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆటోనగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి పురపాలక సంఘానికి అప్పగించాల్సిన గృహ నిర్మాణశాఖ ఆలాంటి చర్యలు చేపట్టలేదు. రోడ్లు, మురుగు కాలువలు లేక చిన్నపాటి వర్షానికే మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి బురద మయం అవుతోంది. దీంతో ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో 2005-06 సంవత్సరంలో ఆటోనగర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 3000 కుటుంబాలకు 10 వేలకుపైగా జనాభా ఉంది. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలూ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆటోమొబైల్ షాపులను ఆటోనగర్‌కు తరలించడంతో పాటు దీనిపైనే ఆధారపడిన కుటుంబాలు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇళ్లు సైతం మంజూరు చేశారు. దీంతో పట్టణంలోని దాదాపు 3వేల కుటుంబాలకు పైగా ఆటోనగర్‌లో నివాసం కోసం వెళ్లారు. ఇప్పటికి 14 సంవత్సరాలు గడిచినా ఆటో నగర్‌లో కనీస మౌలిక సదుపాయాలను అధికారులు, పాలకులు, కల్పించక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఎలాంటి వసతులూ లేకపోయినప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నారు. రోడ్లు లేవు... కాలువలు లేవు నివాసం ఎలా వుండాలి అంటూ ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం అయితే ఈ ప్రాంతం మరీ దారుణంగా ఉంటుంది. రోడ్లు, డ్రైయినేజీలు లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్లపై వస్తోంది. దీంతో పాటు ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. ఇలా పెరగడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి ఈ ప్రాంత ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు, పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
ఆటోనగర్ రోడ్డుకు పక్కనే వీవర్స్‌కాలనీ ఉంది. వీవర్స్‌కాలనీలో రోడ్లు, కాలువలు కిరికెర పంచాయతీ అధికారులు వేస్తుండటం చూసి వారిని అడిగితే పంచాయతీ పరిధిలోకి ఆటోనగర్ రాదని అక్కడి అధికారులు చెబుతున్నారు. హౌసింగ్ అధికారులను అడిగితే వారి నుంచీ ఎలాంటి స్పందనా లేదు. ఆటోగర్ ఎవరి పరిధిలోకి వస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఈ ప్రాంతంలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వర్షాలు పడితే రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. వీటిపై వృద్ధులు, బాలింతలు రోడ్డు దాటుతూ కిందపడి ఆసుపత్రి పాలవుతున్నారు. సమస్యలకు తోడు ఈ కాలనీల్లో పందులు కూడా స్వైరవిహారం చేస్తున్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాడానికి సైతం జనం జంకుతుంటారు. హౌసింగ్ బోర్డు అధికారులు నిబంధనల మేరకు ఆటోనగర్‌లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పురపాలక సంఘానికి అప్పగిస్తే అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు పురపాలక అధికారలూ కల్పించడంతో పాటు ఇంటి గుత్తలు, కొళాయిలు ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కరించడానికి సాధ్యం అవుతుంది. అయినప్పటికీ పురపాలక సంఘం అధికారులు ఆ ప్రాంతంలో అధిక శాతం పట్టణ వాసులే నివాసం ఉంటున్నారని నీటి కొళాయిలు ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పించారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలంటే హౌసింగ్ అధికారులు పూర్తిస్థాయిలో ఆటోనగర్‌ను అప్పగించినప్పుడే సాధ్యమవుతుందని పురపాలక సంఘం అధికారులు పేర్కొంటున్నారు.
జనాభా ఎక్కువ ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం లేదు..
ఆటోనగర్ ప్రాంతంలో దాదాపు 10 వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే పురపాలక సంఘ ఆధీనంలో ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, పట్టణానికి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆటోనగర్‌కు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎవరైనా జబ్బుల బారిన పడితే వారిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం ఈ ప్రాంతంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలను ప్రారంభించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక నిధులతో ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తాం
వైసిపి సమన్వయకర్త దీపిక వేణురెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసినా ఆటోనగర్‌ను ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. గత పాలకులు ఆటోనగర్‌ను నిర్లక్ష్యం చేశారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తాను బాధ్యతలు స్వీకరించగానే ఆ ప్రాంత ప్రజలు కలిసి సమస్యను వివరించారు. త్వరలో ఆ ప్రాంతాన్ని పరిశీలన చేస్తాం. ప్రభుత్వం విద్య, వైద్యంతో పాటు మురికివాడలో అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. మున్సిపల్ అధికారులతో అభివృద్ధికి నివేదికను సిద్ధం చేసి, దీనిపై త్వరలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరిస్తాం. ప్రత్యేక నిధులను తీసుకొచ్చి అన్ని విధాలా ఆటోనగర్‌ణు అభివృద్ధి చేస్తాం.










