Jun 06,2023 21:37

నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయం


అభివృద్ధికి ఆమడదూరం..
- ఆధునీకరణకు నోచని నందికొట్కూరు మున్సిపాలిటీ
- శిథిలావస్థలో మున్సిపల్‌ భవనాలు
- శాపంగా మారిన నేతల మధ్య సమన్వయ లోపం
ప్రజాశక్తి - నందికొట్కూరు

      నందికొట్కూరు పట్టణం మున్సిపాలిటీగా మారినా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. పట్టణంలో అనేక ఏళ్ళ క్రితం ఉన్న వసతులతోనే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. 2011లో మున్సిపాలిటీగా మారినా ప్రభుత్వం చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. కూరగాయల మార్కెట్‌, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పన వంటివి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వైసిపిలో రెండు గ్రూపులుగా చీలిపోవడం, నేతల మధ్య సమన్వయ లోపం ఉండడంతో అభివద్ధి పనులు ముందడుగు పడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నందికొట్కూరు మున్సిపాలిటీ నాలుగు మండలాలకు కూడలిగా ఉన్నా పట్టణం అభివృద్ధిలో వెనుకబడింది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా ఆశించినంత పురోగతి లేదు. ఇతర అనేక పట్టణాలు వేగంగా పురోగతి సాధిస్తున్నా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 1940 నాటి భవనాలలోనే మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో నందికొట్కూరు మున్సిపాలిటీ నంద్యాల జిల్లాలో కలిసింది. దీంతో నందికొట్కూరు పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించినా నిరాశే మిగిలింది. నగర పంచాయతీగా ఉన్న నందికొట్కూరు 2011లో మున్సిపాలిటీగా రూపాంతరం చెంది 23 వార్డులుగా ఉన్న పట్టణం మున్సిపాలిటీ 2020 ఎన్నికల నాటికి 29 వార్డులకు విస్తరించింది. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం, స్వార్థ రాజకీయాలు అభివృద్ధికి శాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపాదనలు దాటని పనులు : నూతన మున్సిపల్‌ భవన నిర్మాణం ప్రతిపాదన దాటలేదు. మాంసం, చికెన్‌ విక్రయాలు, పండ్ల వ్యాపారాలు రోడ్లపైనే కొనసాగుతున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.109 కోట్లతో అలగనూరు చెరువు నుండి చేపట్టిన పనులు పూర్తికాలేదు. ఇంటింటికి తాగునీటిని అందించేందుకు జలజీవన్‌ మిషన్‌ ఫేజ్‌-2 కింద రూ.41 కోట్లతో ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూలు, పండ్ల వ్యాపారులకు మార్కెట్‌ కేటాయింపు జరగలేదు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కాలేదు. ఆటో స్టాండ్‌ ఏర్పాటు జరగలేదు. పట్టణంలో అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. కర్నూలు-గుంటూరు రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌, సిగళ్లు ఏర్పాటు చేయలేదు. దీని కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2016లో రూ.50 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. కానీ పనులు అటకెక్కాయి. కెజి రోడ్డు విస్తరణ జరిగినా షాపు యజమానులకు నష్టపరిహారం చెల్లించలేదు. పగిడ్యాల రోడ్డు, నంద్యాల రోడ్డు విస్తరణ చేపట్టలేదు. 45 వేల జనాభా కలిగిన నందికొట్కూరు మున్సిపాలిటీలో సామూహిక మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. మెప్మాకు సొంత భవనం లేదు. రూ.1.56 కోట్లతో 2014లో ప్రారంభమైన ముస్లింల షాదీఖానా నేటికి పూర్తి కాలేదు. రాజకీయ విభేదాల కారణంగానే అభివృద్ధికి నష్టం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అభివద్ధికి నోచుకోని దళిత కాలనీలు :
పట్టణంలో సిసి రోడ్లు కొన్ని వార్డులకే పరిమితం అవుతున్నాయి. దళితుల కాలనీల్లో రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేయడం లేదు. కాలనీలో విద్యుత్‌ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడక్కడా మురుగునీటి కాలువలు నిర్మించలేదు. మహిళలకు సామూహిక మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. ఇందిరా నగర్‌లో వాటర్‌ ట్యాంకు చుట్టూ పందులు ఆవాసం ఏర్పరుచుకున్నాయి. ట్యాంకు వద్ద మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. పక్కనే అంగన్‌ వాడీ కేంద్రం ఉంది. పందుల బెడద ఒకవైపు, దోమల బెడద మరోవైపుతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారు.
పన్నులు పెంచుకోవటానికే తప్ప అభివృద్ధి శూన్యం..
పన్నులు పెంచుకోవటానికే మున్సిపాలిటీ చేశారు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. నగర పంచాయతీని మున్సిపాలిటీ చేయడం వల్ల వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు కోల్పోయారు. మున్సిపాలిటీ చేసిన తర్వాత ఇంటి, నీటి, చెత్త పన్నులు, రిజిస్ట్రేషన్లు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు వేశారు. కెెజి రోడ్డుపై డివైడర్‌ ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణ, తుంగభద్ర వాటర్‌ పుష్కలంగా ఉన్న నందికొట్కూరుకు సాగునీరు లేకపోవడంతో వ్యవసాయం అభివృద్ధి కావడం లేదు. మున్సిపాలిటీలో పరిశ్రమలు స్థాపించడానికి నీటి సదుపాయం లేక కొత్తగా ఏవీ రావడంలేదు. ఇప్పటికైనా నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని వసతులు కల్పించాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు.