ప్రజాశక్తి మడకశిర : స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికీ కూడా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలు నోచుకోకపోవడం శోచనీయం. పాలకులు, అధికారులు మారుతున్నారే తప్ప ఆ గ్రామస్తుల తలరాతలు మాత్రం మారలేదని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ మండల పరిధిలోని ఆమిదాల గొంది పంచాయతీ డి. రామగిరి గ్రామం. ఈ గ్రామంలో నేటికీ రోడ్డు సౌకర్యం లేక ప్రజల అవస్థలు పడుతున్నారు. డి రామగిరి గ్రామంలో 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. బోయ సామాజికవర్గానికి చెందిన వారు నివసిస్తున్న ఈ గ్రామం కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంది. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108, 104 వాహనాలు రాలేని పరిస్థితి. సంవత్సరం క్రితం రోడ్డుకు వేసిన కంకర అలాగే ఉంది. దీంతో ఆ కంకరలోనే ప్రజలు నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణులు, బాలింతలు ఆసుపత్రికి వెళ్లాలంటేకనీసం రెండు కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకులు ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప ఆ అవస్థలు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ కూడా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవటాన్ని బటి చూస్తే ఆగ్రామం పట్ల పాలకులకు, అధికారులకు ఎంత వివక్ష ఉందో అర్థం అవుతోంది.










