Aug 28,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలో అవసరమైన సాంకేతిక అభివృద్ధికి అనుమతులు ఇస్తామని ఎపి ఎల్‌డిఎ రాష్ట్ర ఛైర్మన్‌ గొల్లపల్లి విజరు కుమార్‌, అదనపు సిఇఒ డాక్టర్‌ రజనీకుమారి తెలిపారు. సోమవారం బనవాసి ఫారంలో ఉన్న ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రం (ఎఫ్‌ఎస్‌బిఎస్‌)ను సందర్శించారు. బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలో పశువుల నుంచి వీర్యాన్ని ఎలా తీయాలి, వాటిని ఏ విధంగా స్టోరేజ్‌ చేయాలి, వాటిని ఎలా వాడుకోవాలో డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, సంబంధిత విభాగాల డాక్టర్లు ఛైర్మన్‌, సిఇఒకు వివరించారు. ఈ సందర్భంగా విజరు కుమార్‌, రజనీకుమారి మాట్లాడారు. ఈ కేంద్రంలో అవసరమైన సాంకేతిక అభివృద్ధి పరికరాలు, కొరతగా ఉన్న సిబ్బంది, అవసరమైన అభివృద్ధి పనుల కోసం అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో చిన్న, చిన్న సమస్యలు, కొన్ని సాంకేతిక పరికరాలు అవసరం, సిబ్బంది కొరత ఉందని డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ రాష్ట్ర ఛైర్మన్‌కు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. తమ ఫారానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకొని అన్యక్రాంతానికి పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని, అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టిని కూడా కాపాడుకోవడానికి సెక్యూరిటీ సిబ్బందిని పెంచుతామని తెలిపారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల పశుగణాభివృద్ధి ఛైర్మన్లు జగన్మోహన్‌ రెడ్డి, మాధవరెడ్డి, సంతోష్‌ కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ చిరంజీవి, డాక్టర్‌ వసంత రాయలు, డాక్టర్లు చంద్రశేఖర్‌, జగదీష్‌, సత్యనారాయణ, అమృత, లావణ్య, సీనియర్‌ అసిస్టెంట్లు వీరేష్‌, నాయక్‌, సురేష్‌ పాల్గొన్నారు.