Apr 18,2023 22:17

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అందుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. రీ సర్వే, గృహ నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీ, జాతీయ రహదారులకు భూ సేకరణ, స్పందన, ఉపాధి హామీ, వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై సమీక్షించారు. రీ సర్వేలో స్టోన్‌ ప్లాంటేషన్‌ గురువారం నాటికి పూర్తి కావాలన్నారు. అలాగే పెగ్‌ మార్కింగ్‌ పక్రియ 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 7 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్‌ ఈనెల 19న విడుదల చేయాలని చెప్పారు. ప్రణాళిక ప్రకారం రీ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులకు భూసేకరణ పక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించి ఇంకా మొదలు పెట్టని 10,190 ఇళ్ల నిర్మాణాల విషయంలో వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు. ఈనెల 23 లోగా అన్ని ఇల్లు బిబిఎల్‌ లోకి రావాలన్నారు. ఇంటింటికి కొళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేసే పక్రియ పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ కింద కూలీలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్య పెంచి 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ కి సంబంధించి రైతులకు ఈకేవైసీ పక్రియ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కొండయ్య, సిపిఒ విజరు కుమార్‌, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రామకృష్ణ, వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, పిడిఒ విజరు కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.