May 23,2023 22:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : అభివృద్ధి పనుల లక్ష్యాలను అధిగమించడానికి మండలాల ప్రత్యేక అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ లో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు పర్యటించి పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనులు వేగవంతం చేయాలని ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. బాలింతల సర్వేలో సాంఘిక సంక్షేమం అసిస్టెంట్లు, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి సమాచారాన్ని సేకరించాలన్నారు. 6 నుంచి 19 సంవత్సరాల పిల్లలు, 0 - 5 సంవత్సరాల పిల్లల ఆధార్‌ నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు సత్వరమే జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సిపిఒ విజరు కుమార్‌, సాంఘిక సంక్షేమ అధికారి శివరంగ ప్రసాద్‌, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, ఐసిడిఎస్‌ పీడీ నిర్మలజ్యోతి, నోడల్‌ అధికారి శివారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.