Jun 02,2023 22:16
  • త్వరలో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా యాప్‌
  • పరికరాల కోసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవచ్చు
  • రూ.125.48 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్ము విడుదల

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) ద్వారా రైతులకు అందిస్తోన్న సేవలను గణనీయంగా పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను శుక్రవారం గుంటూరులో పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి రెండో మెగా పంపిణీలో భాగంగా రూ.361.29 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను స్థానిక చుట్టుగుంట సర్కిల్‌లో పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.125.48 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్మును కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల గ్రూపుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్‌బికె వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ప్రతి ఆర్‌బికె పరిధిలో వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ప్రతి ఆర్‌బికె పరిధిలో ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను తీసుకునేందుకు ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ యాప్‌లో ఎవరైతే మెసెజ్‌ పెడతారో వారికి సంబంధిత యంత్ర పరికరాలు రైతులందరు వాడుకునేందుకు, పేద రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు అతి తక్కువ అద్దెతో వినియోగించుకునేందుకు వైఎస్‌ఆర్‌ యంత్రసేవా యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ యాప్‌ సహాయంతో 15 రోజుల ముందుగానే వ్యవసాయ ఉపకరణాలను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 10,444 ఆర్‌బికెల పరిధిలో రూ.1052 కోట్ల ఖర్చుతో యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఆర్‌బికెకు రూ.15 లక్షలు కేటాయించి, అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలని రైతులనే నిర్ణయించుకోమని చెప్పి, వాళ్ల నిర్ణయం ప్రకారం ఆ యంత్ర సేవలన్నీ వారి అవసరాల మేరకు తీసుకుని వస్తున్నామని తెలిపారు. 491 క్లస్టర్ల స్థాయిలో వరి బాగా పండుతున్న చోట కంబైన్డ్‌ హార్వెస్టర్లు తీసుకుని రావాల్సిన అవసరం గుర్తించామన్నారు. ఒక్కో క్లస్టర్‌ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను రూ.25 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్టు తెలిపారు. గ్రూపులుగా ఏర్పడిన రైతులు కేవలం పది శాతం సొమ్ము చెల్లిస్తే 40 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన 50 శాతం రుణంగా ఇవ్వనున్నారని వివరించారు. వచ్చే అక్టోబరులో ఏడు లక్షల మంది రైతులకు స్పేయర్లు, టార్పాలిన్లు, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు అంజాద్‌ బాష, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, విడదల రజనీ, కాకాని గోవర్థన్‌రెడ్డి, ఎంపిలు మోపిదేవి వెంకటరమణ, నందిగామ సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గన్నారు.