Oct 19,2023 21:43

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:వివిధ రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలు అందించి తమదైన ముద్ర వేసిన వారికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు, ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఇస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జివిడి కృష్ణమోహన్‌ తెలిపారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సమాచారశాఖ కమిషనరు టి విజయకుమార్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు. ఈ కమిటీ వివిధ రంగాల్లో నిపుణులైన వారిని, రాష్ట్రానికి వేర్వేరు రంగాల్లో సేవలు అందించిన వారిని ఎంపిక చేసిందని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వివిధ స్థాయిల్లో పరిశీలించిన అనంతరం అవార్డులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 27 అవార్డులను సిఫార్సు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు ప్రకటించినట్లు తెలిపారు. నవంబరు ఒకటోతేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అవార్డుల బహూకరణ జరుగుతుందని పేర్కొన్నారు. అవార్డులతోపాటు కొంత నగదు ఇస్తామని, అయితే అది ప్రదానం కాదని, వారు చేసిన సేవలు కీలకమని కృష్ణమోహన్‌ వివరించారు. లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు, ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు ఐదు లక్షలు ఇస్తామని వివరించారు.
అవార్డులు పొందింది వీరే...
వ్యవసాయంలో పంగి వినీత, వైవి మల్లారెడ్డి, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌లో యడ్ల గోపాలరావు, తలిశెట్టి మోహన్‌, కోట్ట సచ్చిదానందశాస్త్రి, కోన సన్యాసి, ఉప్పాడ హ్యాండ్‌ అండ్‌ వీవర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, ఎస్‌వి రామారావు, రావు బాల సరస్వతి, తల్లావఝుల శివాజి, కలీసాహెచ్‌ మహబూబ్‌, షేక్‌ మహబూబ్‌ సుభానీ దంపతులకు అవార్డులు అందాయి.
అలాగే తెలుగు భాష, సాహిత్య రంగంలో బేతవోలు రామబ్రహ్మం, ఖదీర్‌బాబు, మహెజబీన్‌, నామిని సుబ్రహ్మణ్యం, అట్టాడ అప్పలనాయుడు, క్రీడా రంగంలో పుల్లెల గోపీచంద్‌, కరణం మల్లీశ్వరి, వైద్య రంగంలో ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఇసి వినరుకుమార్‌రెడ్డి, మీడియా రంగంలో గోవిందరాజు చక్రధర్‌, హెచ్‌ఆర్‌కె అవార్డుకు ఎంపికయ్యారు. వీరితోపాటు సమాజ సేవా రంగంలో బెజవాడ విల్సన్‌, శ్యామ్‌ మోహన్‌, నిర్మల హృదయ భవన్‌ (విజయవాడ), డాక్టర్‌ జి సమరం ఉన్నారు.