మంగళగిరి: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫామ్-7 ద్వారా ఓట్ల తొలగింపు, ఫామ్-6 ద్వారా 1.20 లక్షల కొత్త ఓట్ల చేరికలకు తెరలేపారన్నారు. వైసిపి నేతలకు అధికారులు కొమ్ముకాస్తూ, అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీని వెనుక ఉన్న ఫేక్ సిమ్‌కార్డు రాకెట్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.''కొందరు ఎన్నికల అధికారులు అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. పర్చూరులో అధికారులకు వీఆర్‌తో సరిపెట్టారు. 189 మంది కుట్రకు పాల్పడితే 12మందిపైనే చర్యలు తీసుకున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేవరకూ విడిచిపెట్టం. ఓట్ల తొలగింపు కుట్ర ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటే ఏ అధికారైనా బలికాక తప్పదు. టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 25వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు'' అని సాంబశివరావు ఆరోపించారు.










