Nov 07,2023 08:26

-ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు కేంద్రానికి దాసోహం
-దేశసంపదను కొల్లగొడుతున్న బిజెపికి మద్దతివ్వడం దారుణం
-ప్రాజెక్టులంటే పంచుకోవడం, కొల్లగొట్టడమేనా?
-ఏజెన్సీలోని ప్రజారక్షణ భేరి బస్సు యాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి:దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి దాసోహం అనడం అత్యంత దారుణమని, రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న ఈ పార్టీలు కేంద్రంలోని బిజెపితో మాత్రం దోస్తీ చేస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్యర్యంలో ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సోమవారం ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో సాగింది. కుక్కునూరులో ప్రారంభమైన యాత్ర... వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం మీదుగా కొయ్యలగూడెం వరకు కొనసాగింది. ఈ యాత్రకు ఏజెన్సీ ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఊరి పొలిమేర్లకు ఎదురొచ్చి హారతులిచ్చి తిలకం దిద్ది ఆహ్వానించారు. గిరిజన నృత్యాలు ప్రదర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో బి.వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్ర హక్కులు, ప్రజా సమస్యల గురించి వైసిపి ప్రభుత్వంగానీ, ప్రధాన ప్రతిపక్షాలుగానీ కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతుంటే మద్దతు పలుకుతున్నాయని తెలిపారు. జగన్‌ అదానీని కలిశాడంటే మోడీని కలిసినట్టేనని, రాష్ట్రంలో వనరులను దోచి పెట్టడానికే ఇది జరుగుతోందని వివరించారు. ప్రాజెక్టులంటే పంచుకోవడం, కొల్లగొట్టడం అన్నట్లు తయారైందని విమర్శించారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డగోలుగా నిర్మించడంతో నాలుగు పిల్లర్లు దెబ్బతిన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితీ అదేవిధంగా ఉందని తెలిపారు. ఏజెన్సీలోని ఆదివాసీల భూములను మోడీ, జగన్‌ లాక్కుంటున్నారని విమర్శించారు. పోలవరం సమస్యలపై కేంద్ర మంత్రి అర్జున్‌ముండన్‌ను కలిశామని, రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి నిర్వాసితుల సమస్యలు తీసుకురాలేదని ఆయన చెప్పారని వెంకట్‌ తెలిపారు. డిసెంబర్‌లో పోలవరంలో పర్యటిస్తామని తెలిపారని వివరించారు. 2018 భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం అందించాలని, ఏ రోజు గ్రామాన్ని ఖాళీ చేస్తే ఆ రోజే కటాఫ్‌ డేట్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. జీలుగుమిల్లిలోని గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందన్నారు. పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం పంచాయతీలో దాదాపు 1200 ఎకరాల సాగు భూమిని ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు ఆదానీకి అప్పగించాలని కేంద్రం చూడడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో అక్కడ కార్మికులకు అండగా సిపిఎం నిలబడిందన్నారు. కేరళ మోడల్‌ తరహాలో రోజుకు రూ.850 కూలి, 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌, ఉచిత విద్య, వైద్యం, రేషన్‌ కింద 12 రకాల సరుకులు, ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటివి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఏజెన్సీలో అభివృద్ధి శూన్యం : వి.శ్రీనివాసరావు
ఏజెన్సీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రోడ్లు, సాగునీరు, వైద్యం, విద్య ఏవీ సక్రమంగా లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అవినీతి ఆరోపణలతో అధికార, ప్రతిపక్షాలు తిట్టుకోవడం తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజా సమస్యలను వేదికగా చేయాలని ఈ యాత్ర చేస్తున్నామన్నారు. పార్టీ సందేశాన్ని గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని కోరారు. అదానీ, అంబాని ఇచ్చే నిధులతో నడిచే పార్టీలు వారికి అండగా ఉంటాయని, సిపిఎం మాత్రం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి, కేంద్రంలో బిజెపి ప్రతి ఏడాదీ పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేసి చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితుల సమస్యలను స్వయంగా చూసి సిపిఎం పాదయాత్ర చేపట్టిందన్నారు. కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదని, నిర్వాసితుల సమస్యలు, పరిహారం, పునరావాసంపై దేశమంతా చర్చించుకునేలా సిపిఎం చేసిందని తెలిపారు. నిర్వాసితుల కోసం పోరాడేది ఎర్ర జెండాయేనని అన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌ నిర్వాసితులకు ఇచ్చిన రూ.పది లక్షల పునరావాస ప్యాకేజీ, భూములకు రూ.5 లక్షల పరిహారం హామీ అమలు కాలేదని తెలిపారు. పోలవరం వద్ద 38 మీటర్లకే వరద నీరు వస్తే గ్రామాలన్నీ మునిగిపోతుండగా 41, 45 కాంటూరు లెక్కలెంటో అర్థం కావడంలేదన్నారు. నిర్వాసితుల కోసం కివ్వాక గ్రామంలో నిర్వహించిన రెండు పునరావాస కాలనీలు కూడా వరదలకు మునగడం వైఫల్యం కాక ఇంకేంటని ప్రశ్నించారు. వెంటనే నిర్వాసితులకు నాణ్యమైన ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేందర్‌, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర నాయకులు అశోక్‌, ఎం.సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎ.రవి తదితరులు పాల్గన్నారు.