Aug 15,2023 13:38

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : అధికారుల సమష్టి కృషితో కృష్ణాజిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడం పట్ల కలెక్టర్‌ పి. రాజాబాబు పలు శాఖల అధికారులను ప్రశంసించారు. 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను కలెక్టర్‌ ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ... గతంలో మన దేశాన్ని పాలించిన పరాయి దేశస్థులు భారతీయుల పట్ల ఎంతో చులకన భావం కలిగి ఉండే వారిని మనకు స్వతంత్రంగా పరిపాలించుకునే సత్తా లేదని హేళన చేసేవారన్నారు. ఆ అపోహ నుంచి మన వెలుపలకు వచ్చి ప్రపంచంలోనే భిన్నత్వం గల దేశాల్లో అతిపెద్ద జనాభా ఉన్న భారతదేశంగా రూపొందించుకున్నామన్నారు. భారతదేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల భారతరాజ్యాంగం సువిశాల రాజ్యాంగంగా ఆవిర్భవించిందని అన్నారు. అక్షరాస్యత ద్వారా ఆత్మగౌరవంను పెంపొందించుకొని, ఒక మహౌన్నత ఆశయం కోసం స్వాతంత్య్రాన్ని బ్రిటిష్‌వారి నుంచి సాధించామని చెబుతూ, 77 సంవత్సరాల కాల గమనంలో మన దేశం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని భారతీయులందరూ దృఢ సంకల్పంతో కష్టించి పనిచేసి దేశానికి, రాష్ట్రానికి, జిల్లా ప్రజలందరికీ మంచి చేకూరేలా నిస్వార్థంతో కష్టించి పని చేయాలని మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకొని భారతీయులు, అన్ని రంగాలలో ముందుండి అభివృద్ధి చెంది తద్వారా మన దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టర్‌ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పి రాజబాబు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజీత సింగ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిణి ఏ ఎస్‌ ఎన్‌ రాధిక, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిఐపిఆర్‌ఓ వెంకటేశ్వర ప్రసాద్‌ తో కలిసి కలెక్టరేట్‌ ప్రాంగణంలో గల తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. తర్వాత ఇటీవల ఆధునీకరించిన రెవెన్యూ రికార్డు రూమును లాంచనంగా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు ప్రారంభోత్సవం చేశారు.