Sep 16,2023 13:09

హైదరాబాద్‌ : తెలంగాణాతోపాటు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారాల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్య్లుసి) సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు, సోనియగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీలతోపాటు పలువురు సీనియర్‌నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనబోయే ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం విలేకర్లతో మాట్లాడుతూ.. 'త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచనపై పార్టీ అగ్రనేతలు ఈ సిడబ్ల్యుసి సమావేశాల్లో చర్చించనున్నారు. ఇండియా కూటమిపై, కూటమిలోని మా భాగస్వాములతో తదుపరి సమావేశంలో చర్చలు జరుగుతాయి.' అని ఆయన అన్నారు.
కాగా, కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సిడబ్ల్యుసి ఇదే తొలి సమావేశం కావడం విశేషం.