- తరువాత పూర్తిస్థాయి మ్యానిఫెస్టో
- జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు తనను దూరం చేశామనుకుంటున్నారని, త్వరలోనే తాను బయటకు వస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 'నేను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు, అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా, సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి తన పేరే తలుస్తారు. తాను జైలులో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను, విధ్వంస పాలనను అంతం చేయాలనే ప్రజా సంకల్పంలో ఉన్నాను.'.. ఇలా సాగిపోయింది ఆ లేఖ. చంద్రబాబు ఆ బహిరంగ లేఖను ములాఖత్‌లో తన కుటుంబ సభ్యులకు అందించగా, టిడిపి ఆదివారం నాడు ఇక్కడ విడుదల చేసింది. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం తన కళ్ల ముందు కదలాడుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానమంతా సాగిందని తెలిపారు. మీ నుంచి ఒక్క రోజు కాదు కదా ఒక్క క్షణం కూడా ఎవరూ తనను దూరం చేయ లేరంటూ గంభీరమైన పదజాలాన్ని లేఖ నుండి దట్టించారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయని పేర్కొన్నారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని తెలిపారు. జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవని పేర్కొన్నారు. త్వరలో బయటకు వచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని చెప్పారు. ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పుడూ బయటకు రాని తన భార్య భువనేశ్వరిని ప్రజల తరపున పోరాడాలని కోరారని, అందుకు ఆమె ఒప్పుకున్నారనివివరించారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టేందుకు 'నిజం గెలవాలి' అంటూ భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. చెడు గెలిచినా నిలవదని, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల పరీక్షలో గెలిచి తీరుతుందని తెలిపారు.










