- బీహార్ సర్వే వాస్తవాలను బిజెపి జీర్ణించుకోలేకపోతోంది : సీతారాం ఏచూరి విమర్శ
పాట్నా : బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేలో వెల్లడైన వాస్తవిక వివరాలను బిజెపి జీర్ణించుకోలేకపోతోందని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ''తొమ్మిదేళ్ల నుండి దేశంలో బిజెపి అధికారంలో వుంది. వెనుకబడిన తరగతుల పట్ల అంతలా ఆందోళన చెందుతుంటే, ఇంతవరకు కులాలవారీగా గణన ఎందుకు నిర్వహించలేదు?'' అని ఏచూరి ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొనేందుకు సమస్తిపూర్, దర్భాంగాలకు వెళుతూ ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. కుల సర్వే సరిగా నిర్వహించలేదని, రాష్ట్రంలోని పాలక మహా కూటమి ప్రభుత్వానికి తగినట్టుగా నిర్వహించారంటూ కుల సర్వేపై బిజెపి నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో వ్యాఖ్యానించాలని విలేకర్లు ప్రశ్నించగా ఏచూరి పై రీతిన స్పందించారు. ''రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో కుల సర్వే నిర్వహించిందని మేం విశ్వసిస్తున్నాం. కుల సర్వేకు మేం ఎల్లప్పుడూ అనుకూలమే'' అని ఆయన ఉద్ఘాటించారు.
ఆప్ నేత, రాజ్యసభ ఎంపి సంజరు సింగ్‌ను ఇటీవల అరెస్టు చేయడంపై స్పందిస్తూ, ఇది, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలను దారుణంగా దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. పైగా, ఇడికి నేరారోపణ రేటు చాలా తక్కువగా 0.1శాతం కన్నా తక్కువగా వుందని, ఇప్పటివరకు 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, కానీ అందులో కేవలం 23మంది మాత్రమే దోషులుగా నిర్ధారించబడ్డారని అన్నారు.










