- వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో జి20సదస్సు నిర్వహణకు దేశం సిద్ధమవుతోంది. అనేక అంతర్జాతీయ వార్తా సంస్థలు దీనిపై కథనాలు, విశ్లేషణలు వండి వారుస్తున్నాయి. జి20 అధ్యక్ష పదవిని మోడీ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటోందో, వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లకు వల వేసేందుకు ప్రధానికి ఈ వేదిక ఎలా ఉపయోగపడుతుందో విశ్లేషిస్తూ వార్తలు అందిస్తున్నాయి.
జి20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఆయన భద్రతా సలహదారు జేక్ సులివాన్ పత్రికా గోష్టిని ఏర్పాటు చేశారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు అవరోధాలు, హింసాత్మక ఘటనలు, అరెస్టులు వంటి అంశాలను మోడీతో జరిపే సమావేశంలో బైడెన్ ప్రస్తావిస్తారా అని అడిగిన ప్రశ్నకు జేక్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆ అంశాలు ఇప్పటికే ద్వైపాక్షిక సమావేశంలో చర్చకు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆయా అంశాలపై అమెరికా వైఖరి స్పష్టంగా ఉన్నదని కూడా తెలిపారు. కాగా ప్రమాదకరమైన మోడీ మెజారిటీవాదాన్ని పశ్చిమ దేశాలు పట్టించుకోబోవని 'గార్డియన్' పత్రిక రాసింది. మోడీని, ఆయన రాజకీయ విశ్వాసాలను డొనాల్డ్ ట్రంప్ (అమెరికా), మారిన్ లీ పెన్ (ఫ్రాన్స్), విక్టర్ హార్బన్ (హంగరీ)ల ఆలోచనలతో పోల్చింది. మోడీ తన సొంత ప్రతిష్టను ఇనుమడింపజేసుకునేందుకు జి20 సదస్సును వాడుకుంటున్నారని, దీనిపై పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారని 'న్యూయార్క్ టైమ్స్' వ్యాఖ్యానించింది.
'భారతదేశంలో పేదలు రోడ్ల పైన, అందర్‌పాస్‌లలో తల దాచుకుంటున్నారు. పేవ్‌మెంట్లపై వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుంటాయి. మురికివాడలు, అనుమతి లేని నివాస గృహాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. జి20 సదస్సును ఘనంగా నిర్వహించే పేరుతో మూడు లక్షల మంది వీధి వ్యాపారులను ఖాళీ చేయించారు' అని గార్డియన్ పత్రిక తెలిపింది. అధికారులు తమకు అసౌకర్యంగా ఉన్న వాస్తవాలను మరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన విషయమని అని 'ప్రాజెక్ట్ సిండికేట్' రాసింది. భారతదేశంలో మందగిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న అసమానతలు, సన్నగిల్లుతున్న ఉద్యోగావకాశాలు వంటి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని వ్యాఖ్యానించింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయని 'టెలిగ్రాఫ్' పత్రిక ఎత్తిచూపింది. విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని, పౌష్టికాహార లోపంతో చిన్నారులు అనారోగ్యాలకు లోనవుతున్నారని తెలిపింది.
జి20 సదస్సు కోసం ప్రభుత్వం రూ.990 కోట్లు కేటాయించిందని, నెల రోజుల ముందు నుండే రాజధానిలో కూల్చివేతలు ప్రారంభించి వేలాది మందిని వీధులపాలు చేసిందని సీఎన్‌ఎన్ ఓ నివేదికలో వివరించింది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను 'ఫారిన్ అఫైర్స్' మేగజైన్ ప్రస్తావించింది. దీనిని అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. దేశంలో మైనారిటీలపై కొనసాగుతున్న వివక్షను 'ఫైనాన్షియల్ టైమ్స్' ఎత్తిచూపింది. ఇప్పటి వరకూ దేశంలో ఇలాంటి అంతర్జాతీయ సమావేశాలు అనేకం జరిగినప్పటికీ సాధించింది శూన్యమని, సమావేశాల చివరలో సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేయలేకపోయారని 'అసోసియేటెడ్ ప్రెస్' వార్తా సంస్థ గుర్తు చేసింది.










