- కేంద్ర నిర్లక్ష్య ధోరణితో ప్రతిభావంతులు దూరం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిభావంతులైనవారిని దూరం చేసుకోవాల్సివస్తోందని మోడీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవుల కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో ఈ పరిస్థితి ఎదురైందని సర్వోన్నత న్యాయస్థానం వాపోయింది. బెంచ్‌లో చేరేందుకు తమ లా ప్రాక్టీస్‌ను కూడా వదులుకోవడానికి సుముఖంగా వున్న, మెరుగైన ప్రతిభ కలిగిన వారు ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధితులు అవుతున్నారని జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ సుదాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అకారణంగా కొందరి పేర్లను తొలగించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంది. ''హైకోర్టులో న్యాయమూర్తి పదవులు చేపట్టేందుకు ముందుకు రావడానికి తిరస్కరిస్తున్నారు. అయినా మేం ప్రయత్నించాం, మంచి టాలెంట్ ఉన్నవారిని న్యాయమూర్తులు తీసుకునేందుకు కృషి చేశాం, కానీ పేర్ల విభజన కారణంగా మంచి టాలెంట్‌ను కోల్పోవాల్సివస్తోంది. దాంతో వారు వైదొలగారు. మేము ఎవరి పేర్లు బయటపెట్టాలనుకోవడం లేదు. కానీ ఒకరిద్దరు మంచివారిని కోల్పోయాం.' అని జస్టిస్ కౌల్ కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి తెలిపారు.
హైకోర్టు కొలీజియమ్‌లు న్యాయమూర్తుల పదవుల కోసం సిఫార్సు చేసిన దాదాపు 70పేర్లను అటార్నీ జనరల్ దృష్టికి జస్టిస్ కౌల్ తీసుకువచ్చారు. 2022 నవంబరు నుండి దాదాపు పది మాసాల పాటు ఈ పేర్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వున్నాయి. పిటిషనర్ అయిన అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అరవింద్ దతార్, న్యాయవాది అమిత్ పారులు మాట్లాడుతూ, ''ప్రభుత్వానికి కొలీజియమ్‌లు అందచేసిన జాబితా నుండి కొన్ని పేర్లను మాత్రమే తొలగించడమనేది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా వుంది.'' అని పేర్కొన్నారు. కొలీజియం ఈ పద్దతి వద్దని చెప్పినా ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. కొరడా ఝళిపించి, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారిని ప్రక్షాళన చేయాల్సిన సమయమిదని ఈ తరహాలో ఇకపై జరగరాదని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.










