భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్‌కు పాకిస్థాన్ కూడా రానుంది. భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ తొలుత నిరాకరించినప్పటికీ చివరకు దిగిరాక తప్పలేదు. ఇండియాలో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ పాక్ ప్రభుత్వాన్ని పీసీబీ కోరింది. ఈ నేపథ్యంలో, పాక్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. క్రికెట్‌ను రాజీకీయాలతో ఎందుకు ముడిపెడతారని ప్రశ్నించాడు. ఇతర క్రీడల విషయంలో పాక్, ఇండియాకు మధ్య సంబంధాలు ఉన్నప్పుడు.. క్రికెట్ విషయంలో సంబంధాలు ఎందుకు లేవని అడిగాడు. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందని.. ఆ మజాను ఆస్వాదించే అవకాశాన్ని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులకు దూరం చేయకూడదని చెప్పాడు. ఇది ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నాడు. ఇండియాలో జరిగే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ కచ్చితంగా ఆడుతుందని మిస్బా చెప్పాడు. తాను ఇండియాలో ఎన్నో సార్లు ఆడానని.. అక్కడ ఆడితే కలిగే ఒత్తిడిని, అక్కడుండే అభిమానుల కోలాహలాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. ఇండియాలోని కండిషన్స్ పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. ఇండియాలో పాకిస్థాన్ క్రికెట్ ఆడాల్సిందేనని అన్నాడు. కేవలం క్రికెట్ పైన, వరల్డ్ కప్ గెలవడం పైనే దష్టి సారించాలని తమ ఆటగాళ్లకు సూచించాడు.










