న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ నడుస్తోంది. పలువురు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ఈ బిల్లుపై పలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ మాట్లాడుతూ.. ప్రముఖ రెజ్లర్లను బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ లైంగికంగా వేధించారని ఆరోపణలున్నప్పటికీ ఆ ఎంపీపై బిజెపి ఎందుకు చర్య తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ బిల్లు ఓ జిమ్మికు అని ఆమె అభివర్ణించారు.
ఈ సందర్బంగా ఆమె 'బిజెపిలోని నా సహచరులకు మనస్తత్వ పరివర్తనకు ప్రాధాన్యాత ఇవ్వాలని నేను కోరుతున్నాను. వారు తమ మాటలతో వారి చర్యలతో మహిళల పట్ల నిజమైన గౌరవాన్ని ప్రదర్శించడం అత్యవరం. మహిళల్ని అగౌరవపరిచే వారిపై తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.' అని ఆమె అన్నారు.
'దేశానికి పతకాలు తెచ్చిన బంగారుతల్లులు లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు వ్యతిరేకంగా వారు జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేస్తే.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్ ఇక్కడ కూర్చున్నాడు. అతనిపై కేసు నమోదు కాలేదు. మహిళల్ని అభివృద్ధి, ప్రగతి దిశగా తీసుకెళ్లేందుకు మీకు నిజంగా ఆసక్తి ఉంటే బాధ్యులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.' అని కకోలీ ప్రశ్నించారు. కేవలం రెజర్ల లైంగిక వేధింపుల విషయంలో మాత్రమే కాదు.. హత్రాస్, ఉన్నావ్ వంటి అత్యాచారం- హత్య కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? జమ్మూలో ఓ చిన్నారిని రాళ్లతో కొట్టి చంపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌ని అరెస్టు చేయాలని రెజ్లర్లు నిరసన చేస్తే వారిని కూడా కొట్టారు. వేధించారు. అని కకోలీ అన్నారు.
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద అనేక మంది మహిళలు పొలాల్లో పనిచేస్తున్నారు. కానీ వారి చెల్లింపులు ఇంకా విడుదల కాలేదు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని మహిళా పరిశోధకులకు జీతాల్ని ఇంకా చెల్లించలేదు. వారికి స్టైఫండ్స్‌ని ఇవ్వడం లేదు. ప్రతిష్టాత్మక ప్రయోగమైన చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత కూడా మహిళా శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు జీతాలు చెల్లించలేదు. కాబట్టి ముందు మీరు మహిళల్ని గౌరవించాలి అని ఆమె అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందని దస్దిదార్ అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని దస్తిదార్ అన్నారు.
2014లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదు? 2024 ఎన్నికల సమయంలోనే ఈ రిజర్వేషన్ బిల్లుని ఎందుకు పెడుతున్నారని ఎంపీ దస్తీదార్ శ్న్రించారు. డీలిమిటేషన్‌ను రిజర్వేషన్‌తో ఎందుకు ముడిపెట్టారు? ఇది దుర్మార్గమైన చర్య అని ఆమె ఆరోపించారు.










