Jul 23,2023 08:59
  • సచివాలయ ఉద్యోగుల ఎదురుచూపులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తొలి ఇంక్రిమెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రొబేషన్‌ పీరియడ్‌ 01.07.22న డిక్లేర్‌ చేయడంతో వారికి ఈ ఏడాది జులై ఒకటో తేదితో ఏడాది సర్వీసు పూర్తయింది. ఏడాది పూర్తయిన తరువాత జీతంతో పాటు, ఇంక్రిమెంటు కూడా ఇయ్యాలన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదంటూ అధికారులు ఇంక్రిమెంటు నిలిపి వేశారు. జులై నెల జీతంతో పాటు సచివాలయ ఉద్యోగులకు రూ.620 ఇంక్రిమెంట్‌ కింద వారి జీతాలకు అదనంగా కలపాల్సి ఉంది. ఉద్యోగులకు జీతంతో పాటు ఇంక్రిమెంట్‌ కలపాలని సర్వీస్‌ రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌) నిర్వహించే అధికారి అధికారి ప్రొసీడింగ్స్‌ను డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అధికారి (డిడిఓ)లకు ఇవ్వాల్సి ఉంది. గ్రేడ్‌-5,6 పంచాయతీ కార్యదర్శుల ఎస్‌ఆర్‌ మెయిన్‌టెయిన్‌ చేసే అధికారిగా ఎంపిడిఓ, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్టకు సంబందించి డిడి సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి, మహిళా పోలీస్‌లకు జిల్లా ఎస్‌పి, ఉద్యానవనశాఖకు డిడి హర్టికల్చరల్‌ అధికారి ఎస్‌ఆర్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు లేవంటూ వీరు ఇంక్రిమెంటుకు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ను జారీ చేయలేదు. ఒక్క విజయనగరం జిల్లాలోనే కలెక్టర్‌ నాగలక్ష్మీ ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన శాఖలు, ఇతర జిల్లాల్లో కలెక్టర్లు ఇటువంటి ప్రొసీడింగ్స్‌ ఇవ్వకపోవడంతో ఎస్‌ఆర్‌ మెయిన్‌ టెయిన్‌ చేసే అధికారులు డోలాయమానంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇంక్రిమెంటుపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
 

                                                              రొటీన్‌ ప్రక్రియే : అజయ్ జైన్‌

ఉద్యోగులు రెగ్యులర్‌ అయిన ఏడాది తర్వాత ఇంక్రిమెంట్‌ జీతాలతో జమ చేయడమనేది రొటీన్‌ ప్రక్రియే అని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అజరుజైన్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌ మెయిన్‌టెయిన్‌ చేసే అధికారులు ప్రొసీడింగ్స్‌ ఇవ్వని కారణంగా డిడిఓలు ఇంక్రిమెంట్‌ జమ చేయలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ఇంక్రిమెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని చెప్పారు.