- అనుసంధానం సాకుతో నిరాకరణ
- జాబ్ కార్డుల తొలగింపుతో ఇబ్బందులు
- ప్రామాణీకరణలోనూ సమస్యలు
- తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 20.8 లక్షల మంది కార్మికులు క్రియాశీలకంగా పని చేస్తున్నప్పటికీ వారికి సకాలంలో వేతనాలు అందడం లేదు. దీనికి కారణం...వారి జాబ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఎబిపిఎస్)తో అనుసంధానం కాకపోవడమే. వేతనాలు పొందాలంటే వారికి ఈ అనుసంధానం తప్పనిసరి. దక్షిణాది రాష్ట్రాలలో ఉపాధి పథకంలో మొత్తం 3.57 కోట్ల మంది లబ్ది పొందుతుండగా వారిలో 3.36 కోట్ల మంది ఎబీపీఎస్‌తో అనుసంధానమయ్యారు. ఈ నెల 17 నాటికి ఇంకా 20.8 లక్షల మంది కార్మికుల జాబ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఈ వ్యవస్థతో అనుసంధానం కాలేదు. దీంతో వారికి వేతనాలు అందలేదు. దేశంలో ఎబిపిఎస్ కింద అర్హత పొందిన కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలలో దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాలు ఉండడం ఓ విశేషమైతే, వాటిలో సైతం లక్షలాది మంది లబ్దిదారులు ఇప్పటికీ అనుసంధానం కోసం వేచి చూడాల్సి రావడం దురదృష్టకరం.
గడువు సమీపిస్తున్నా...
దేశవ్యాప్తంగా 14.4 కోట్ల మంది క్రియాశీలక కార్మికులు, 2.89 మంది కార్మికులకు ఇప్పటికీ ఈ వ్యవస్థతో అనుసంధానం జరగలేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఆధార్ ఆధారిత అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో అనేక పర్యాయాలు గడువు పెంచారు. తాజా గడువు ప్రకారం ఈ నెల 31లోగా కార్మికులు ఎబీపీఎస్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. చట్ట ప్రకారం పని చేసిన పదిహేను రోజులలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. అయితే చెల్లింపులలో జాప్యం జరుగుతోంది. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ దీనికి మరో అడ్డంకిగా మారింది. చాలా మంది కార్మికులు ఆధార్ సీడింగ్‌ను, ప్రమాణీకరణ (అథెంటికేషన్) ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. అవి పూర్తి చేస్తేనే వారికి వేతనాలు అందుతాయి. ఉదాహరణకు ఒక్క తెలంగాణలోనే ఆగస్ట్ రెండో వారం నాటికి సుమారు 41.99 లక్షల మంది (క్రియాశీలక కార్మికులతో కలిపి) కార్మికులకు అనుసంధానాలు పూర్తి కాలేదు. జాబ్ కార్డులు జారీ అయిన వారిని మొత్తం కార్మికులుగా (టోటల్ వర్కర్స్), 2022-23లో పని చేసిన వారిని క్రియాశీలక కార్మికులుగా (యాక్టివ్ వర్కర్స్) పరిగణిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ నెల 17వ తేదీ నాటికి 3,57,25,047 మంది క్రియాశీలక కార్మికులు ఉండగా, వారిలో 3,56,38,420 మందికి సీడింగ్ పూర్తయింది. 3,51,52,392 మంది ప్రామాణీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా 3,36,42,935 మంది ఎబిపిఎస్‌తో అనుసంధానం అయ్యారు. ఇంకా అర్హత సాధించని వారి సంఖ్య 20,82,112.
చిన్న చిన్న కారణాలతో...
ఫిబ్రవరి వరకూ కార్మికుల బ్యాంక్ ఖాతాలలో వేతనాలు జమ చేసే వారు. ఆధార్ ఆధారిత చెల్లింపులు కూడా చేసేవారు. ఎబిపిఎస్‌తో అనుసంధానంపై ప్రకటన చేసే సమయానికి కేవలం మూడో వంతు క్రియాశీలక కార్మికులు మాత్రమే అర్హులుగా తేలారు. ఎబిపిఎస్‌కు అర్హులు కావాలంటే కార్మికుల జాబ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో సీడింగ్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ సంక్లిష్ట ప్రక్రియ కారణంగా అనేక జాబ్ కార్డులను పొరబాటుగా తొలగించారు. అక్షర దోషాలు, చిన్న చిన్న తప్పి దాలను కారణంగా చూపారు. ఉదాహరణకు తెలంగాణలోని నారాయణ్‌పేట్ జిల్లాకు చెందిన 22 సంవత్సరాల యువకుడు, ఆమె తల్లిదండ్రులు ఉపాధి పథకం పైనే ఎక్కువగా ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారు.
వారికి ఎబీపీఎస్‌తో అనుసంధానానికి అవసరమైన జాబ్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ యువకుడి జాబ్ కార్డును అకస్మాత్తుగా తొలగించారు. దీంతో అతను ఉపాధి హామీ పథకం కింద పనికి అనర్హుడు అయ్యాడు. గత వేసవిలో నెల రోజులు పని చేసినా వేతనం ఇవ్వలేదని, చివరికి జాబ్ కార్డు రద్దయిందని చెప్పారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పనికి వెళ్లినప్పుడు మస్టర్ రోల్‌లో పేరు కనిపించని సందర్భంలో మాత్రమే క్రియాశీలక కార్మికులకు జాబ్ కార్డులో సమస్య ఉన్నదని అర్థమవుతోంది. అక్షర దోషాలు, పురుషుడు లేక స్త్రీ అనే విషయాన్ని తప్పుగా నమోదు చేయడం వంటి చిన్న చిన్న కారణాలతో జాబ్ కార్డులు ఆధార్‌తో సీడింగ్ కావడం లేదు. ఆధార్‌ను ప్రజా పంపిణీ వ్యవస్థతో, ఓటర్ ఐడీ కార్డులతో అనుసంధానం చేసే సమయంలో కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులే సమస్యలకు కారణమవుతున్నాయి.
ఒకసారి ఆధార్‌ను తప్పుగా అనుసంధానం చేసినా, పొరబాటున తొలగించినా, సీడింగ్ లేదా ప్రమాణీకరణ ప్రక్రియలో తేడాలు ఉన్నా సమస్యను పరిష్కరించడం అంత తేలిక కాదు. కొన్ని సందర్భాలలో ఫిర్యాదులు వచ్చినప్పుడు కార్మికుడు చనిపోయాడనో లేదా పని చేయడానకి ఇష్టపడడం లేదనో చెప్పి జాబ్ కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. సమస్యను పరిష్కరించే ఓపిక, సహనం లేకనే వారు ఇలా కార్డుల తొలగింపునకు పూనుకుంటున్నారు.
ఆగస్ట్ 3వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 33.23 లక్షల కార్డులను తొలగించారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది. అసలు జాబ్ కార్డులను తొలగించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ వాటిని పాటిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.
ఈ సమస్యలు కూడా...
అసలు ఆధార్ సీడింగ్, ప్రామాణీకరణ ప్రక్రియ సరిగా జరిగాయా లేదా అనే విషయం కూడా కార్మికులకు తెలియడం లేదు. తగిన సాంకేతిక పరిజ్ఞానం వారిలో లేకపోవడమే దీనికి కారణం. ఎబిపిఎస్ గుర్తించిన బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మ్యాపర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కార్మికులకు పలు బ్యాంక్ ఖాతాలు ఉంటే తాజాగా మ్యాపింగ్ జరిపిన ఖాతాలోనే వేతనాలు జమ చేస్తారు. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక డిజిటల్ అటెండెన్స్ కూడా సమస్యలకు కారణమవుతోంది. ఫొటోలు తీసే సమయంలో పని ప్రదేశంలో లేకపోతే ఆ రోజుకు వేతనం లభించదు. గ్రామీణ ప్రాంతాలలో యాప్ సరిగా పని చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ ప్రమాణీకరణ విజయవంతం కాకపోతే లక్షలాది మంది కార్మికులకు వేతనాలు అందవు.
మరోవైపు ఉపాధి పథకానికి నిధుల కేటాయింపులు రానురానూ తగ్గిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని నీరు కారుస్తోందని విమర్శించాయి.










