Jul 28,2023 10:00
  • ఎన్నికలు సమీస్తున్న వేళ కార్యకర్తలకు తాయిలాలు
  • స్థలాలు చూసుకోండి..
  • భూ పంపిణీలో మీకూ ఇస్తాం..!
  • మద్దతుదారులను ప్రసన్నం చేసుకునే పనిలో అధికార నేతలు

ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వేడి మొదలైంది. 2024 ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నాయకులు పడ్డారు. అధికార పార్టీలో ఈ ప్రక్రియ ఎక్కువగా కన్పిస్తోంది. ఎందుకంటే అధికారం ఉండి కూడా ఈ నాలుగేళ్లలో తామేమీ లబ్ధిపొందలేదనే భావన ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు వీరు సహకరించే విషయంలో కూడా సందిగ్ధం నెలకొంది. దీంతో అధికార పార్టీ నేతలు ఆయా గ్రామాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగం అయ్యారు.ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 రెండు పార్లమెంటు స్థానాల్లోనూ వైసిపి గెలుపొందింది. మొదటిసారి ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ద్వితీయశ్రేణి నాయకులు వారి భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వైసిపి అధికారం చేపట్టినా ద్వితీయ శ్రేణి, కార్యకర్తలను ముఖ్య నేతలెవరూ పట్టించుకోలేదన్న భావన కింద స్థాయి నేతల్లో ఉంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనూ పలుమార్లు నాయకులు, ముఖ్య నేతల తీరును కార్యకర్తలు ఎత్తిచూపారు. వారు ఏ రకంగా సంపాదించుకుంటున్నారో కూడా తెలియజేశారు. ఈ సమీక్షలు తరచూ జరుగుతుండటంతో కొంతమంది ఎమ్మెల్యే, ముఖ్య నాయకుల పట్ల అధిష్టానం కూడా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో రకంగా అసంతృప్తితోనున్న వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ముఖ్య నేతలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందరినీ పిలిచి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఏమి కావాలో అడిగి తెలుసుకుని వాటిని చేసే పెట్టే పనుల్లో కొంత మంది నేతలు నిమగమయ్యారు. ఇందులో అనంతపురం, సత్యసాయి జిల్లా పరిధిలోనున్న ఒక నియోజకవర్గ నాయకులు ఆయనకు సమయం దొరికనప్పుడల్లా పంచాయతీల వారీగా నేతలను పిలిపించి వారి సమస్యలు వినడం, ఏమి చేయాలని అడగటం జరుగుతోంది. వాటిని పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు కూడా హామీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మకాం వేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి అసంతృప్తులను తిరిగి బుబ్జగించే పనిని చేపట్టారు. ఇంకో నియోజక వర్గంలో ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూ పంపిణీలో వారికి కేటాయించాలని అధికారులకు ఆదేశా లిస్తున్నారు. అదే విధంగా విలువైన చోట ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఒక్కోక్కరి రెండు నుంచి మూడు సెంట్ల వరకైనా ఇంటి స్థలాన్ని కేటాయించాలని అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చిన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ భూ పంపిణీలోనే అసంతృప్తులను సంతృప్తి పరిచే చర్యలు చేపట్టారు.
 

                                              అభివృద్ధి పనులు తీసుకునేందుకు వెనుకడుగు..!

వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చేసుకోమంటే చేసుకోవడానికి కార్యకర్తలే వెనుకడుగువేస్తున్నారు. బిల్లులు సకాలంలో రాకపోతే ఇబ్బందులు పడుతామన్న ఉద్ధేశంతో పనులు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా గతంలో 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకంగా పనులు చేసి బిల్లులు రాక ఇప్పటికీ ఇబ్బందులు పడుతుండటం చూసి వీరు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా భూములు అవి కాకుండా ఇసుక, మట్టిని విక్రయించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రకంగా ఎన్నికలకు ముందు కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి తిరిగి ఎన్నికల్లో పనిచేయింంచుకునే ఆలోచన ముఖ్య నేతలు చేస్తున్నారు. దీంతో ఆ నేతల ఇళ్ల వద్ద ఇటీవల నిత్యం రద్దీ కన్పిస్తుండడం గమనార్హం.