- 27 మందికి సన్మానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి ప్రతియేటా ఇస్తున్న వైఎస్‌ఆర్ లైఫ్‌టైం అచీవ్‌మెంటు అవార్డులు తెలుగువారి గొప్పదనానికి నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంటు అవార్డులను రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్, సిఎం తల్లి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు గ్రహీతలకు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నరు అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. నవరత్నాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతియేటా ప్రతిభావంతులను గుర్తించి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం మంచి కార్యక్రమమని తెలిపారు. సిఎం జగన్‌మోహన్‌్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో సుసంపన్నం చేసిన వారిని మూడేళ్లుగా గౌరవిస్తున్నామని చెప్పారు. ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్నవారికి ఇస్తున్న అవార్డులని పేర్కొన్నారు. తెలుగు తనానికి, తెలుగుమాటకు, తెలుగువాడి గుండెకు, ధైర్యానికి, రైతుల మమకారానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అంతకు ముందున్న పరిస్థితులను మార్చేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఆయా రంగాల్లోనే సేవలు చేస్తున్న వారిని అవార్డుకు ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న వారందరూ ఆయా రంగాల్లో వారి జీవితాన్ని అర్పించిన వారని, వారి వారసత్వాన్ని భుజాన వేసుకుని మోశారని పేర్కొన్నారు. వారంతా జాతి సంపదని, వారికి సమాజం ఇచ్చిన గుర్తింపుగా ఈ అవార్డులను చూడాలని తెలిపారు. ఈ ఏడాది 27 మందికి ఈ అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సమాచారశాఖ కమిషనర్ తుమ్మా విజయకుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కమ్యూనికేషన్స్ సలహాదారులు జివిడి కృష్ణమోహన్ అవార్డుల ప్రాధాన్యత వివరించారు. మొత్తం 27 మందిలో 23 మందికి లైఫ్‌టైం అచీవ్‌మెంటు అవార్డులు, నలుగురికి అచీవ్‌మెంటు అవార్డులు అందజేశారు. క్రీడల విభాగంలో కరణం మల్లేశ్వరి, పుల్లెల గోపీచంద్, కళలు, సంస్కృతి విభాగంలో తల్లావజ్జుల శివాజి, రావు బాలసరస్వతి, చిగిచర్ల కృష్ణారెడ్డి, కలీషాబీ, సుభానీ తదితరులు అవార్డులు అందుకున్న వారిలో వున్నారు.










