Nov 03,2023 18:04

హైదరాబాద్‌ : జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం కృషి చేస్తామని సీపీఐ, సీపీఐ(ఎం)లు హామీ ఇచ్చాయి. ఈ మేరకు శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిలను డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్‌, ట్రెజరర్‌ చిలుకూరు అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్‌ తదితరులు ఆయా రాష్ట్ర పార్టీ ఆఫీసుల్లో వారిని వేరువేరుగా కలిశారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తమ్మినేని, కూనంనేని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. తమ్మినేని అక్కడికక్కడే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో చేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌ కు సూచించడం విశేషం. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బల్లోజు రవి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే తాము బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి పార్టీ నాయకులకూ వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కవిత, టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, బిజెపి అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి లను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలను కలిసి మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం చేర్చాలని డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ పలు పార్టీలను కోరుతున్న సంగతి తెలిసిందే.