న్యూఢిల్లీ : పాలస్తీనాలో దాదాపు రెండు వందల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఇజ్రాయిల్ తాజా దాడుల ను ఇరాన్, సిరియా తదితర దేశాలు ఖండిస్తుంటే కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం హమాస్ మిలిటెంట్ల దాడిని ఖండించింది. పాలస్తీనా విమోచనా పోరాటానికి మద్దతునివ్వడం భారత విదేశాంగ విధానంలో ఒక భాగంగా ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయిల్‌తో దోస్తీ చేస్తూ, చిరకాలంగా అనుసరిస్తూ వస్తున్న విధానానికి తిలోదకాలిచ్చింది. హమాస్ మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు అండగా వుంటామని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. హమాస్ చేపట్టిన అల్ అక్సా ఆపరేషన్‌ను సాకుగా తీసుకుని నెతన్యాహు పాలస్తీనాపై పెద్దయెత్తున బాంబుల వర్షం కురిపిస్తుంటే ఇజ్రాయిల్ ప్రజలకు పూర్తి బాసటగా వుంటామని మోడీ పేర్కొనడం గమనార్హం. హమాస్ దాడుల్లో 22మంది మరణించగా, ఇజ్రాయిల్ జరిపిన ప్రతీకార దాడుల్లో 200 మంది దాకా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు.










