Oct 20,2023 08:25

ఎఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో:' బిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం ఒక్కటేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. పేదల ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌వైపే ఉంది. కుల గణన చేపట్టేందుకు బిఆర్‌ఎస్‌, బిజెపి జంకుతున్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతాం. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం..' అని ఎఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎ న్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర, రోడ్‌షోల్లో రాహుల్‌ గాంధీ పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని కెసిఆర్‌, పేదల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోడీ ఇద్దరూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకున్నామని తెలిపారు. ఒబిసిల జపం చేసే ప్రధాని మోడీ ప్రభుత్వంలో 90 మంది కార్యదర్శులు ఉంటే.. వారిలో ముగ్గురే ఒబిసిలు ఉన్నారని తెలిపారు. పేదలకిచ్చే స్కీములకు ఎన్ని నిధులు కేటాయించాలి?., ప్రభుత్వ ఆస్తులు ఏవి అమ్మాలనే లెక్కలు తీస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తాను ప్రశ్నిస్తే పార్లమెంట్‌లో మోడీ కనీసం సమాధానం ఇవ్వలేదన్నారు. పైగా బిజెపిని ప్రశ్నిస్తున్నాననే కక్షతో తనపై 27అక్రమ కేసులు బనాయించి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి.. ఇంటిని సైతం ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గనని, ప్రజల పక్షానే పోరాడుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. వచ్చిన తొలి రోజుల్లోనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఆయా కులాల వారీగా రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేకూర్చుతామని అన్నారు.