Oct 21,2023 08:10

ఉపాధ్యాయుల ప్రాణాలు పోతున్న పట్టించుకొని ప్రభుత్వం
రాష్ట్రప్రభుత్వంపై యుటిఎఫ్‌ ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానం(ఒపిఎస్‌)పునరుద్ధరణ చేయకుండా గ్యారంటీ పెన్షన్‌ స్కీం(జిపిఎస్‌)ను బలవంతంగా అమలు చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని యుటిఎఫ్‌ నేతలు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావుతో కలిసి ఫెడరేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ యుటిఎఫ్‌ రాష్ట్రకార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి జిపిఎస్‌ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 2040 నాటికి పెన్షన్‌ భారం వేలకోట్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, జిపిఎస్‌ జివోలో మాత్రం కేవలం రూ.2500 కోట్లు అని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఉద్యోగులు కంట్రిబ్యూషన్‌ లేని పెన్షన్‌ను ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. దీనిపై ఆలోచన చేయకుండానే ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. రెండు రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం, పోలీస్‌, అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో కూర్చున్న నేతల ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. వైద్యుల సూచన మేరకు దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం భవిష్యత్‌లో నిరవధిక దీక్షలు చేపడతామని ఈ నెల 9వ తేదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాము నోటీసు అందించామని వెల్లడించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ తీరును ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 3.5లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్‌ అమలు చేయకుండా జిపిఎస్‌ అమలు చేయడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, తాలూకా కేంద్రాల్లో వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రాణాల గురించి ఆలోచించకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒపిఎస్‌ పునరుద్ధరిస్తామనే పార్టీకే ఓట్లు వేయాలనే ప్రచారం తాము చేపడతామన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పాత పెన్షన్‌ అమలు డిమాండ్‌ను సజీవంగా ఉంచుతామన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో పాసైన జిపిఎస్‌ బిల్లును గవర్నర్‌ ఆమోదించాల్సి ఉందన్నారు. ఒపిఎస్‌ పునరుద్ధరణ డిమాండ్‌ను సజీవంగా ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన యుటిఎఫ్‌ దీక్షలు విజయవంతం అయిన్నట్లు వెల్లడించారు.రాష్ట్రప్రభుత్వ వైఖరి, పోలీస్‌, అధికారుల వైఖరి సమంజసంగా లేదన్నారు. గతంలో అనేక దీక్షలు చేశామని, ప్రభుత్వాలు స్పందించాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దుర్మారంగా మొండివైఖరితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తామన్న పార్టీనే సమర్ధిస్తామన్నారు. ఈ అంశంపై అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహించి ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను సమైఖ్య పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమకుమారి, ఎస్‌పి మనోహర్‌కుమార్‌, ప్రచురణల విభాగం చైర్మన్‌ ఎం హనుమంతరావు, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, ఎ సుందరయ్య, ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.