Sep 30,2023 10:11
  • పొత్తు ధర్మానికి కట్టుబడి ఉంటాం

న్యూఢిల్లీ : ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామనీ, పొత్తుకు ధర్మానికి కట్టుబడి ఉన్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇటీవల పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడంతో కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య విభేదాలు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడిక్కడ ఢిల్లీ సచివాలయంలోని మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. 'ఇండియా' కూటమితో పొత్తు విషయంలో స్పష్టత ఇచ్చారు. 'ఇండియా కుటమికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి దూరంగా ఉండేది లేదు. పంజాబ్‌ పోలీసులు కొందరు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు. పంజాబ్‌ పోలీసులే చెప్పాలి. వారినే మీరు అడగండి. మాదకద్రవ్యాలపై భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వ్యక్తిగత కేసులు లేదా వ్యక్తుల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. కానీ మాదక ద్రవ్యాల బెడదను నివారించేందుకు మాత్రం మేం కట్టుబడి ఉన్నాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాం. ఇందుకు పాల్పడే వ్యక్తులు ఎంతటి పెద్దవాళ్లయినా విడిచిపెట్టే ప్రసక్తి లేదు' అని కేజ్రీవాల్‌ తెలిపారు.
            పంజాబ్‌ పోలీసులు 2015లో నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి ఖైరాను చండీగఢ్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ అరెస్టును రాజకీయ ప్రతీకార చర్యగా కాంగ్రెస్‌ పంజాబ్‌ నాయకులు ఆరోపించారు. భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రభుత్వంపై విమర్శలుచేశారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యేనని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీంద్‌ సింగ్‌ రాజా వారింగ్‌ ఆరోపించారు. కాగా, కాంగ్రెస్‌ విమర్శలను పంజాబ్‌ ఆప్‌ సీనియర్‌ ప్రతినిధి జగ్తార్‌ సింగ్‌ ద్యాల్‌పుర తోసిపుచ్చారు. డ్రగ్స్‌ స్మగ్లర్లపై ఎలాంటి రాజీలేని వైఖరిని భగవత్‌ సింగ్‌ మాన్‌ ప్రభుత్వం అనుసరిస్తోందని, కాంగ్రెస్‌ నేతపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.