ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో కులగణనకు కాంగ్రెస్ నూటికి నూరు శాతం కట్టుబడి ఉందని ఆ సీనియర్ నేత, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కులగణన చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎఐసిసి కార్యాలయంలో సోమవారం సిడబ్ల్యుసిి సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సోనియా, రాహుల్ ó, ప్రియాంక óకాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తదితరులు పాల్గొన్నారు.
కులగణనకు మోకాలడ్డుతున్న మోడీ
దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టేందుకు మోడీ ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నదని రాహుల్ విమర్శించారు. 'కులగణనకు ఆయన (మోడీ) సిద్ధంగా లేరు. మాకున్న నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ఒబిసిలు ఉన్నారు. 10 మంది బిజెపి ముఖ్యమంత్రుల్లో ఒక్కరే ఒబిసి కేటగిరికి చెందిన వారున్నారని ఆయన అన్నారు. కుల గణన అనేది రాజకీయ పరమైన అంశం కాదు. న్యాయ ఆధారిత నిర్ణయం' అని రాహుల్ స్పష్టం చేశారు.
కులగణనకు తమ పార్టీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని సోనియా అన్నారు. తాము అధికారంలోకి వస్తే వాయిదా పడుతూ వస్తున్న 2021 జనాభా లెక్కల సేకరణతోబాటే దేశవ్యాపితంగా కులగణనను చేపడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి సిడబ్ల్యుసి ఒక తీర్మానం కూడా చేసిందని ఆమె తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) సహా మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సత్వర అమలుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 'మోడీ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ బిల్లును అమలుపై కాలయాపన చేసేలా జనాభా లెక్కలు, డీలిమిటేషన్ వంటి అడ్డంకులు సృష్టించిందని, తాము వీటన్నిటినీ తొలగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానంలో పేర్కొంది. జనాభాలో వారి నిష్పత్తికి అనుగుణంగా ఒబిసిలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేసింది.
ఐదు రాష్ట్రాల్లో విజయానికి ఐక్యతతో పని చేయాలి : ఖర్గే
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ శక్తియుక్తులతోపాటు సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 'ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కట్టడి, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మణిపూర్‌కు ఒక్కసారి కూడా వెళ్లని ప్రధాన మంత్రి, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పదేపదే వెళ్తున్నారని ఆయన విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో నిర్ణయాత్మక విజయాల తర్వాత పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను గెలిచేందుకు కలసికట్టుగా కృషి చేయాలని ఖెర్గే కాంగ్రెస్ శ్రేణులను కోరారు.










