- ఫైనల్లో 2వ సీడ్ జబీర్‌పై గెలుపు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను నయా ఛాంపియన్ ఎగరేసుకుపోయింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి, 24ఏళ్ల మార్కెటా వోండ్రుసోవా విజయం వరుససెట్లలో 2వ సీడ్ జబీర్‌ను చిత్తుచేసింది. వోండ్రుసోవా 42వ ర్యాంక్ క్రీడాకారిణి. 2017నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలో దిగుతున్న వోండ్రుసోవా ఏనాడూ 2వ రౌండ్‌ను దాటిన దాఖలాలు లేవు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 3వ రౌండ్‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో 2వ రౌండ్‌లోనే నిష్క్రమించిన వోండ్రుసోవా.. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎగరేసుకుపోవడం విశేషం. శనివారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో వోండ్రుసోవా 6-4, 6-4తో 2వ ర్యాంక్ క్రీడాకారిణి, ట్యునీషియాకు చెందిన ఆన్స్ జబీర్‌పై వరుససెట్లలో విజయం సాధించింది. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇద్దరూ మూడేసిసార్లు విజయం సాధించగా.. టైటిల్ నెగ్గేక్రమంలో వోండ్రుసోవా ఐదుగురు సీడెడ్ క్రీడాకారుణిలపై విజయం సాధించడం విశేషం.
- వోండ్రుసోవా టైటిల్ సాధించిందిలా..
ఫైనల్ : జబీర్(2)పై 6-4, 6-4(గెలుపు)
సెమీఫైనల్ : స్వీటోలినాపై 6-3, 6-3(గెలుపు)
క్వార్టర్‌ఫైనల్ : పెగులా(4)పై 6-4, 2-6, 6-4(గెలుపు)
4వ రౌండ్ : బోస్కోవా(33)పై 2-6, 6-4, 6-3(గెలుపు)
3వ రౌండ్ : వేకిక్(20)పై 6-1, 7-5(గెలుపు)
2వ రౌండ్ : కుడెర్మటోవా(12)పై 6-3, 6-3(గెలుపు)
1వ రౌండ్ : స్టెరన్స్‌పై 6-2, 7-5(గెలుపు)










