Nov 05,2023 11:18

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి/విజయవాడ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపి బస్సు యాత్ర కవరేజ్‌కి వెళ్ళిన ఈనాడు ఫొటోగ్రాఫర్‌ సుబ్రమణ్యం, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ ఉమామహేశ్వర రావుపై వైసిపి కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోలు తీయడాన్ని వైసిపి కార్యకర్తలు అడ్డుకోగా వాగ్వావాదం జరిగింది. వైసిపి దౌర్జన్యానికి పాల్పడడంపై ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్‌ఎన్‌ మీరా తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే సభ ముగిసిన తరువాత ప్రజలు వెళ్లిపోయిన తరువాత ఫొటోలు తీయడాన్ని వైసిపి నాయకులు ఖండించారు.
 

                                                                     దాడి సరికాదు : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

ఈనాడు ఫొటో జర్నలిస్ట్‌పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకట్రావు, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులపై దాడులను నివారించాలని, దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుపై దాడిని ఇండియన్‌ ఫొటోగ్రఫీ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ఖండించింది.