ఇంఫాల్ : మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకుంది. కర్ఫ్యూను ఉల్లంఘించి మరీ... ఆర్మీ బారికేడ్‌ను తొలగించేందుకు మైతీలు బుధవారం ప్రయ త్నించారు. కొందరు సాయుధ దుండగులు కాల్పులు జరపగా, ఒక గుంపు రాళ్లు రువ్వింది. దీంతో ఆర్మీ బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, మహిళలుసహా మరో 40 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్ జిల్లా ఫౌగాక్‌చావో ఇఖారు, క్వాక్తా వద్ద రెండు కిలోమీటర్ల పరిధిలోని రెండు ప్రదేశాల్లో సుమారు 10 వేల మంది మైతీలు ఆందోళన చేశారు. బిష్ణుపూర్- చురచంద్‌పూర్ సరిహద్దుల్లో బారికేడ్‌ను తొలగించాలని మైతీ గ్రూపులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ ఇంటిగ్రిటీ కో-ఆర్డినేషన్ కమిటీ (కొకొమి) పిలుపు మేరకు పది వేల మంది వరకూ చురచంద్‌పూర్ చేరుకున్నారు. ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో రోజంతా కర్ఫ్యూ విధించినప్పటికీ వేలాదిమంది కవాతుగా ఆర్మీ బారికేడ్ వద్దకు చేరుకున్నారు. క్వాక్టా వద్ద కేంద్ర భద్రతా బలగాలు వారిని ఆపడంతో ఆ గుంపు రాళ్లు రువ్వింది. గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించగా తొక్కిసలాటలో మహిళలతోసహా కొందరు గాయపడ్డారని రక్షణ వర్గాలు తెలిపాయి. సాయుధ దుండగులు కొందరు పోలీసుల వేషంలో వచ్చారని, ఆటో మెటిక్ గన్‌లతో భద్రతాబలగాలపై కాల్పులు జరిపారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.










