టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ జోనర్లకే దర్శకులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే అడపాదడపా వచ్చే ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాలూ లేకపోలేదు. అలాంటి వాటిల్లో ఒకటిగా నిలిచే ఎమోషనల్ డ్రామానే 'విమానం'. మనలో చాలామందికి విమానం అనేది కామన్ విషయం. చిన్న పిల్లలకు మాత్రం అదో ఎమోషన్. విమానం అంటే విపరీతమైన పిచ్చి ఉండే అలాంటి ఓ నిరుపేద పిల్లాడి కథనే తెరకెక్కించాడు దర్శకుడు శివప్రసాద్. మరి దీని కథేంటి? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? వంటి విషయాలు తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. వీరయ్య (సముద్రఖని) ఓ దివ్యాంగుడు. హైదరాబాద్‌లో ఓ చిన్న మురికివాడలో తన కొడుకు రాజు (మాస్టర్ ధృవన్) తో జీవనం సాగిస్తుంటాడు. వీరయ్య కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న వ్యక్తి. భార్య మరణించడంతో రాజుతో కలిసి ఆటోస్టాండ్ దగ్గర మరుగుదొడ్ల నిర్వహిస్తుంటాడు. దానిపై వచ్చే చాలీచాలని సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. అయితే బడికి వెళ్లే రాజుకి విమానం అంటే విపరీతమైన పిచ్చి. అందుకే ఎప్పుడూ విమానం గోలే. అబ్బాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని వీరయ్య నిర్ణయించుకుంటాడు. తన కొడుకు కోరికని నెరవేర్చేందుకు ఆ తండ్రి ఏం చేశాడు? కథలో సుమతి (అనసూయ) పాత్ర ఏంటి? వీరయ్య జైలుకు ఎందుకు వెళ్లాడు? చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) పాత్రలు ఏమిటి? అనేదే మిగిలిన కథ...!

టైటిల్‌కు తగ్గట్టుగానే స్టోరీ మొత్తం విమానం చుట్టూనే తిరుగుతుంది. దీంతోపాటు తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలే ప్రధానంగా సాగే చిత్రమిది. తన కొడుకు కోరికని తీర్చే క్రమంలో ఓ తండ్రి జీవితంలోని సంఘర్షణని హృదయాలకి హత్తుకునేలా తెరపైన ఆవిష్కరించారు దర్శకుడు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు.. పాత్రలు ఇందులో ఉంటాయి. అయితే కథని ఎక్కువగా వీరయ్య.. అతని కొడుకు చుట్టూనే తిప్పడంతో కథ ఓ చిన్న పార్శ్వానికే పరిమితమైనట్టు అనిపిస్తుంది. వీరయ్య... అతని వ్యక్తిత్వం, బస్తీ జీవితాన్ని ఆవిష్కరిస్తూ సినిమా టేకాఫ్ అవుతుంది. అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే రాజుకి విమానంపై ఉన్న ఇష్టంతో అతను వేసే ప్రశ్నలు... స్కూల్లో తన స్నేహితులతో కలిసి విమానం గురించి చెప్పుకొనే ముచ్చట్లు నవ్విస్తాయి. చిన్నారుల అమాయకత్వం నుంచి మంచి వినోదం పండుతుంది. మరోవైపు కోటి, సుమతి పాత్రల హంగామా కాలక్షేపాన్నిస్తుంది.

తండ్రి పాత్రకు సముద్రఖని న్యాయం చేశారు. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. మాస్టర్ ధ్రువన్ నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు కంటతడ పెట్టిస్తాయి. ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అవుతారు. అయితే... బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు గుర్తు చేసుకునే మరో కేరెక్టర్ అనసూయ. సుమతి పాత్రలో జీవించేసింది. ఆమె పాత్ర పలికే సంభాషణలు బాగుంటాయి. రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఒకప్పటి కథానాయిక మీరా జాస్మిన్ అతిథి (ఎయిర్ హోస్టెస్) పాత్రలో మెరుస్తారు. ఇక సంగీతం సినిమాకి ప్రధానబలం. ముఖ్యంగా సందర్భోచితంగా వచ్చే పాటలు, వాటిలోని సాహిత్యం అర్థవంతంగా ఉంది. కెమెరా పనితనం బాగుంది. మార్తాండ్ ఎడిటింగ్ పర్వాలేదు. రావూరి మాటలు చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించాయి. దర్శకుడు శివ ప్రసాద్ కథలో భావోద్వేగాలు ఉన్నాయి.
టైటిల్ : విమానం
నటీనటులు : సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : వివేక్ కాలేపు
ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం : చరణ్ అర్జున్
ఆర్ట్ : జె.జె.మూర్తి
పాటలు : చరణ్ అర్జున్
సంభాషణలు : హను రావూరి (తెలుగు)
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్










