Oct 30,2023 07:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, కోట :సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా విజయనగర ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పైడితల్లమ్మ ఆలయం వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్సవ ర్యాలీని ప్రారంభించారు. పైడితల్లమ్మ ఆలయం నుంచి కోట, సింహాచలం మేడ మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు సుమారు 71 కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల రోలర్‌ స్కేటింగ్‌, అమ్మవారి ఘటాలు, నాదస్వరం, ఎన్‌సిసి బృందాల కవాతు, విద్యార్థుల ప్రదర్శనలు, థింసా నృత్యం, తప్పెట గుళ్లు, కోలాటాలు, బిందెల నృత్యం, చెక్కభజనలు, గంగిరెద్దులు, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, పులివేషాలు, సాము గరిడీలు తదితర కళారూపాల ప్రదర్శనలతో ర్యాలీ సాగింది. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి బత్స సత్యనారాయణ మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయం, కళల పరిరక్షణకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. పండుగకు వచ్చే లక్షలాదిమంది యాత్రికులు ఎటువంటి ఇబ్బందులకూ గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆనంద గజపతి ఆడిటోరియంలో మహారాజా సంగీత కళాశాల ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. మహారాజా సంగీత కళాశాలలో పుష్ప, ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు. లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో 80 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 31 మంగళవారంతో ముగియనున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మేయర్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.