Apr 20,2023 17:02
  •  మండుటెండల్లో మూడు గంటలు రాస్తారోకో

ప్రజాశక్తి-హిందూపురం(సత్యసాయిజిల్లా) : సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి తెలుగు చలనచిత్రం విజయవంతం కావడంతో శత దినోత్సవ వేడుకలను శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో నిర్వహించడానికి బాలయ్య అభిమానులతో పాటు టిడిపి నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన పురపాలక సంఘ ఆధీనంలో ఉన్న ఎం జిఎం మైదానం ఇవ్వాలని నాయకులు అభిమానులు పురపాలక సంఘ అధికారులను రాతపూర్వకంగా కోరారు. గత నాలుగు రోజులుగా అనుమతుల కోసం పురపాలక సంఘ కార్యాలయం చుట్టూ తిరిగారు. అయితే మున్సిపల్‌ అధికారులు అనుమతులను నిరాకరించడంతో ఆగ్రహించిన అభిమానులు, టిడిపి నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అయినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మరింత ఆగ్రహంతో మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై మండుటెండల్లో మూడు గంటలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, ఎమ్మెల్సీ, చైర్‌ పర్సన్‌, కమిషనర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఆందోళన జరుగుతున్న సందర్భంలోనే ముఖ్య నాయకులు, పట్టణ సిఐలు ఈరన్న, వెంకటేశ్వర్లు సమక్షంలో మున్సిపల్‌ అధికారులతో రెండుసార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇంచార్జ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఆనంద్‌ కుమార్‌ అనుమతులు ఇవ్వడానికి సాధ్యం కాదని, మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉన్నారని, ఇంచార్జ్‌ కమిషనర్‌గా అనుమతి ఇవ్వడానికి వీలు లేదంటూ తెలిపారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతనని చెప్పారు. దీంతో అభిమానులు, నాయకులు అనుమతులు మంజూరు చేయాలంటూ రోడ్డుపై బైటాయించారు. అటు ఇటు వెళ్లే వాహనాలు ఎక్కడికి అక్కడ ఆగి పోవడంతో ద్విచక్ర వాహన దారులు, బస్సు, లారీలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు ఎంజీఎం మైదానం ఇవ్వడానికి సాధ్యం కాదని రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యంజి యమ్‌ హై స్కూల్‌ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదంటూ రాతపూర్వక మున్సిపల్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌ ఆనంద్‌ కుమార్‌ లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బాలకృష్ణ అభిమానుల సంఘం జాతీయ కన్వీనర్‌ నంబూరి సతీష్‌ కుమార్‌, టిడిపి పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు నాగరాజు లు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంజీఎం మైదానం శత దినోత్సవ వేడుకలకు ఇవ్వక పోయినప్పటికీ హిందూపురంలోనే వేరొక ప్రాంతంలో అనుకున్న రోజునే జరుపుతామన్నారు. పట్టణంలో ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అన్నదానిపై ఇప్పటికే స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. వేడుకల కోసం మైదానం ఇవ్వమని అంటున్న అధికారులు గత పది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం ఆసరా కార్యక్రమం చేయనప్పుడు లేని నిబంధనలు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శాసన సభ్యులు బాలకష్ణ నిర్వహించే కార్యక్రమానికే మున్సిపల్‌ అధికారులు ఇలా చేస్తే సామాన్యులకు వీరు సుపరిపాలన ఎలా అందిస్తారన్నారు. ఏది ఏమైనప్పటికీ హిందూపురంలోనే శత దినోత్సవం వేడుకలను జరుపుతామన్నారు. మున్సిపల్‌ అధికారులు నిరాకరించిన లేఖ ద్వారా కోర్టుకు వెళుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు హెచ్‌ ఎన్‌ రాము, కౌన్సిలర్‌లు రాఘవేంద్ర, సతీష్‌ కుమార్‌, లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ శివకుమార్‌, టిడిపి నాయకులు అమర్నాథ్‌, నజీర్‌, మోద శివకుమార్‌, చంద్రశేఖర్‌, రామాంజి నమ్మ, పరిమళ, వెంకటేష్‌, పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

2