Oct 21,2023 08:10

- తారక రామారావుకు ఎఆర్‌ కృష్ణ జాతీయ పురస్కారం ప్రదానం
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తృతీయ జాతీయ స్థాయి వీణా అవార్డ్స్‌-2023 పద్య, సాంఘిక నాటిక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు పోటీలను తొలిరోజు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిణి బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభలో తొలుత నగరానికి చెందిన నాట్యాచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. వీణా అవార్డ్స్‌ నిర్వహణపై కళల కాణాచి సంస్థ అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్‌ వివరించారు.

  • ఆకట్టుకున్న పద్య నాటికలు

తొలి రోజున ప్రదర్శించిన పద్య నాటికలు ఆహుతలను అలరించాయి. పోటీల్లో తొలి ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన శ్రీ కళానికేతన్‌ వారి వసంత రాజీయం, చెరుకుపల్లికి చెందిన ఉషోదయ నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోహిని భస్మాసుర పద్యనాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంఘిక నాటిక ప్రదర్శనల్లో ప్రత్యేక ప్రదర్శనగా హైదరాబాద్‌ మిత్ర క్రియేషన్స్‌ వారి ఇంపోస్టర్స్‌ నాటకాన్ని ప్రదర్శించారు.

  • ఎఆర్‌ కృష్ణ జాతీయ పురస్కారం ప్రదానం

నాటక పోటీల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు నెమలికంటి తారక రామారావును ఎఆర్‌ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారంతో సత్కరించారు. కళల కాణాచి సంస్థ కార్యదర్శి చెరుకుమల్లి సింగరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎఆర్‌ కృష్ణ తనయులు ఎపి.నీలం పురస్కారాన్ని అందించి, సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పి.దక్షిణామూర్తి, అయినాల మల్లేశ్వరరావు, జిఎస్‌ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.