Aug 30,2023 12:00

ఇస్రో పూర్వపు శాస్త్రవేత్త,
ఐఐఎస్‌టి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వైవిఎన్‌.కృష్ణమూర్తి
ప్రజాశక్తి -   భీమవరం రూరల్‌ (పశ్చిమగోదావరి)

మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్‌ - 3తో ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ సేకరించని విలువైన సమాచారం మనకు అందుబాటులోకి వస్తుందని ఇస్రో పూర్వపు శాస్త్రవేత్త, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వైవిఎన్‌.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులతోనూ మాట్లాడారు. చంద్రయాన్‌ా3 హైడ్రాక్స్‌ మలిక్యుల్స్‌ వంటి ఎంతో విలువైన సమాచారాన్ని అందించిందన్నారు. ఇటువంటి సమాచారం ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశమూ సేకరించలేదన్నారు. చంద్రయాన్‌ - 2 కూడా 25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌లో మూన్‌ను మ్యాప్‌ చేసి పంపిస్తుందని చెప్పారు. ప్రధానంగా ఉష్ణోగ్రతల వ్యత్యాసం వంటి సమాచారం చక్కగా అందిస్తున్నాయన్నారు. కళాశాల స్థాయిలో కూడా స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేసి అధ్యాపకులు, విద్యార్థులు శాటిలైట్స్‌ తయారు చేసేలా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాల విద్యార్థులచే మినీ శాటిలైట్స్‌ రూపొందించేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వచ్చినట్లు చెప్పారు. మానవులు ఎదుర్కొంటున్న కేన్సర్‌ వంటి అనేక రుగ్మతలను గుర్తించటం, పర్యావరణ కాలుష్యం ఏ మేరకు పెరుగుతుంది తదితర అంశాలు అధ్యయనం చేసేందుకు విద్యార్థులు మినీ శాటిలైట్స్‌ రూపొందించవచ్చునన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాకరమైన ఇస్రో శాస్త్రవేత్తగా పని చేసిన వైవిఆర్‌.కృష్ణమూర్తి తమ కళాశాలకు వచ్చి విద్యార్థులకు సూచనలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఆర్‌అండ్‌డి డీన్‌ డాక్టర్‌ పిఎ.రామకృష్ణంరాజు, వివిధ విభాగాల హెడ్స్‌ పాల్గొన్నారు.